న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత తాహిర్ హుస్సేను మెడకు ఉచ్చు బిగుస్తోంది. నిఘా విభాగం ఉద్యోగి అంకిత్ శర్మ హత్య జరిగిన నేపథ్యంలో అతని కేసు నమోదైంది. హత్య, అల్లర్ల కేసులు అతనిపై పెట్టారు. కాగా, ఆప్ నుంచి ఆయనను బహిష్కరించారు. 

సిఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చెలరేగిన హింస నేపథ్యంలో అంకిత్ శర్మపై మూక దాడి చేసి ఆయనను చంపేసి శవాన్నిడ్రైనేజీ కాలువలో పడేసింది. ఈ సంఘటనలో తాహిర్ హుస్సేన్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కున్నారు. దర్యాప్తు పూర్తయి నిర్దోషిత్వం తేల్చుకునే వరకు తాహిర్ హుస్సేన్ ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఆప్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. 

Also Read: అంకిత్ శర్మ హత్యలో ఆప్ నేత పాత్ర: కేజ్రీవాల్ స్పందన ఇదీ...

కిల్లర్ హుస్సేన్ అని అంకిత్ శర్మ తండ్రి రవీందర్ శర్మ ఆరోపించారు. కర్రలు, రాళ్లు, బుల్లెట్లు, పెట్రోల్ బాంబులు పట్టుకున్న ముసుగు ధరించిన వ్యక్తులతో హుస్సేన్ కనిపించారని, హుస్సేన్ కేజ్రీవాల్ తోనూ ఆప్ నాయకులతోనూ మాట్లాడడం కూడా కనిపించిందని ఆయన ఆరోపించారు. 

తనపై వచ్చిన ఆరోపణలను హుస్సేన్ ఖండించారు. తన కుటుంబ సభ్యులతో సహా పోలీసుల సమక్షంలో తాను 24వ తేదీన సురక్షితమైన ప్రాంతానికి వెళ్లానని, ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని ఆయన అన్నారు. 

Also Read: ఢిల్లీ అల్లర్లు.. నిండు గర్భిణీపై దాడి.. మిరాకిల్ అంటున్న డాక్టర్లు

హింసను రెచ్చగొట్టి ఉంటే తమ పార్టీ వారైనా సహించేది లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం అన్నారు. అంకిత్ శర్మ హత్యలో కేజ్రీవాల్ పాత్ర కూడా ఉందని బిజెపి నేత కపిల్ శర్మ ఆరోపించారు. కేజ్రీవాల్, తాహిర్ హుస్సేన్ మధ్య జరిగిన ఫోన్ లో జరిగన సంభాషణల రికార్డులు ఉన్నాయని ఆయన చెప్పారు. 

ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 38 మంది మరణించారు. 200 మంది దాకా గాయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఢిల్లీ పోలీసులతో పాటు హోం శాఖ అధికారులు చెప్పారు.