పౌరసత్వ సవరణ చట్ట అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు 38మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లతో ఎలాంటి సంబంధం లేనివారిపై కూడా ఆందోళనకారులు దాడులు చేశారు. 

అలా ఓకుటుంబంపై దాడి చేయగా.. వారిలో గర్భిణీ కూడా ఉంది. నిండు గర్భిణీపై ఆందోళనకారులు చేసిన దాడిలో ఆమె ప్రాణాలు పోతాయేమోనని అందరూ భయపడిపోయారు. అయితే... అద్భుతం  జరిగిందని డాక్టర్లు చెప్పారు. సదరు మహిళ ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చింది.

Also Read ఢిల్లీ అల్లర్లు: భారీగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేజ్రీవాల్...

పూర్తి వివరాల్లోకి వెళితే... 30ఏళ్ల షబానా పర్వీన్.. నిండు గర్భిణీ. ఈ శాన్య ఢిల్లీలో భర్త, తన ఇద్దరు పిల్లలు అత్తతో కలిసి జీవిస్తోంది.  సోమవారం సాయంత్రం వారంతా తమ ఇంట్లో నిద్రపోతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా కొందరు ఆందోళనకారులు గుంపుగా వచ్చి వారిపై దాడికి పాల్పడ్డారు. గర్భిణీ అని కూడా చూడకుండా షబానపై కూడా దాడి చేశారు.

ఆ రోజు రాత్రి తమ కుటుంబం మొత్తం ఆ అల్లర్ల వల్ల ప్రాణాలు పోగోట్టుకోక తప్పదని అనుకున్నామని.. కానీ దేవుడి దయవల్ల తప్పించుకోగలిగామని షబానా అత్త పేర్కొన్నారు. తన కొడుకును దారుణంగా కొట్టారని.. కడుపుతో ఉన్న తన కోడలి పొట్టపై కూడా కొట్టారని ఆమె పేర్కొన్నారు. 

ఆందోళనకారుల దాడితో షబీనా తీవ్రంగా గాయపడిందని.. వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే.. అక్కడి డాక్టర్ల సలహాతో మరో ఆస్పత్రికి తీసుకువెళ్లామని వారు చెప్పారు. కడపులో బిడ్డ బతుకుతుందని తామెవ్వరూ అనుకోలేదని ఆమె చెప్పారు. అయితే.. అద్భుతం జరిగినట్లు తన కోడలు పండంటి మగబిడ్డకు బుధవారం జన్మనిచ్చిందని వారు చెప్పారు. బిడ్డ ఎంతో ఆరోగ్యం గా ఉండటం గమనార్హం. 

ఆందోళనకారుల తమ ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారని అప్పటి వరకు బాధలో ఉన్న ఆ కుటుంబం.. బిడ్డ పుట్టగానే.. ఆ బాధను మర్చిపోయి ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. ఇప్పుడు తమకు కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదని బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకోవాలని లేదంటా కొత్తగా మరో ఇళ్లు అయినా నిర్మించుకోవాలని వారు చెప్పడం గమనార్హం.