న్యూఢిల్లీ: నిఘా విభాగం (ఐబీ) ఉద్యోగి అంకిత్ శర్మ హత్యలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత తాహిర్ హుస్సేన్ పాత్ర ఉందనే ఆరోపణలపై పార్టీ నేత., ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో అంకిత్ శర్మపై అల్లరి మూక దాడి చేసి, ఆయనను హత్య చేసి శవాన్ని డ్రైనేజీలో పడేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆప్ కార్పోరేటర్ తాహిర్ హుస్సేన్ పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. 

అటువంటి సంఘటనలకు పాల్పడేవారిని ఎవరినీ సహించకూడదని, వాళ్లు ఏ పార్టీకి చెందినవారైనా సరేనని కేజ్రీవాల్ అన్నారు. హింసకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. అటువంటి వారు తన మంత్రివర్గంలో ఉన్నా వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. ఆప్ నకు చెందినవారు అటువంటి ఘటనలకు పాల్పడితే రెండింతల శిక్ష వేయవచ్చునని ఆయన అన్నారు. 

Also Read: ఢిల్లీ అల్లర్లు: బాలిక మిస్సింగ్, ఢిల్లీ ప్రజల కష్టాలు ఇవీ...

దేశ భద్రతకు, ఘర్షణలకు సంబంధించి ఉదయం నుంచీ గమనిస్తుంటే తన వ్యక్తిగత విశ్వాసం ప్రకారం సంఘటనను రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆ సంఘటనను రాజకీయం చేకూడదని ఆయన అన్నారు. 

"స్పందన కోసం నన్ను ఎందుకు అడుగుతున్నారు.. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ను నడపడం ఇలాగేనా? మా వైపు నుంచి ఎవరైనా తప్పు చేసి ఉంటే రెండింతలు శిక్ష వేయండి. జాతీయ సమస్యలను రాజకీయం చేయడం ఆపండి" అని కేజ్రీవాల్ అన్నారు. 

Also Read: అర్థరాత్రి చెలరేగిన హింస: 34కు చేరిన ఢిల్లీ మృతుల సంఖ్య

ఆదివారం నుంచి చెలరేగుతున్న హింసలో ఈశాన్య ఢిల్లీలో 35 మందిదాకా ప్రాణాలు కోల్పోయారు. 200 మందిదాకా గాయపడ్డారు. తన కుమారుడి హత్యలో తాహిర్ హుస్సేన్ అనుచరుల పాత్ర ఉందని అంకిత్ శర్మ తండ్రి రవీందర్ శర్మ ఆరోపిస్తున్నారు.