ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతితో సంబంధం ఉన్న డ్రగ్ కుట్ర కేసులో నటి రియా చక్రవర్తికి ముంబై కోర్టు షాక్ ఇచ్చింది. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఆమె బెయిల్ పిటిషన్ తో పాటు మరో ఐదుగురి బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. దీంతో బెయిల్ కోసం రియా చక్రవర్తి హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

బెయిల్ తిరస్కరణతో ఈ నెల 22వ తేదీన వరకు కూడా రియా చక్రవర్తి బైకుల్లా జైలులోనే ఉండాల్సి వస్తుంది. మూడు రోజుల క్రితం ఎన్సీబీ ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెను బైకుల్లా జైలుకు తరలించారు. తనను బలవంతంగా ఒప్పించారని ఆమె ఇటీవల విమర్శించారు. 

Also Read: సుశాంత్‌, రియాల మధ్య అరుదైన వీడియో వైరల్

జ్యుడిషియల్ కస్టడీలో తన జీవితం ప్రమాదంలో పడిందని రియా అన్నారు. రేప్, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆమె చెప్పారు. మూడు దర్యాప్తు సంస్థల కారణంగా తన మానసిక పరిస్థితిపై, తన బాగుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతోందని ఆమె అన్నారు. 

తను ఏ విధమైన నేరానికి కూడా పాల్పడలేదని, తనను ఈ కేసులో ఇరికించారని ఆమె తన బెయిల్ పిటిషన్ లో అన్నారు. బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ డ్రగ్స్ తీసుకున్న విషయం రియాకు తెలుసునని, డ్రగ్స్ ను సేకరించడం ద్వారా ఆ నేరంలో ఆమె పాలు పంచుకుందని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వాదించింది. 

Also Read: సుశాంత్ కేసు: రియా బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్.

డ్రగ్స్ అక్రమ సరఫరా కోసం రియా చక్రవర్తి ఆర్థిక లావాదేవీలు జరపడానికి తన క్రెడిట్ కార్డు, ఇతర పేమెంట్ గేట్ వేలు వాడిందని ఎన్సీబీ వాదించింది. నేరం చేసినట్లు విచారణలో రియా చక్రవర్తి స్వయంగా అంగీకరించినట్లు తెలిపింది.  

రియా సోదరుడు సోవిక్ చక్రవర్తి, అబ్దుల్ బాసిత్, జియాద్ విలాత్రా, దీపేష్ సావంత్, శామ్యూల్ మిరండాల బెయిల్ పిటిషన్లను ముంబై కోర్టు కొట్టివేసింది.