న్యూఢిల్లీ: గ్యాంగస్టర్ వికాస్ దూబే కేసులో తెలంగాణలో మాదిరిగా సుప్రీంకోర్టు ఓ కమిటీని వేసే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వికాస్ దూబే చేతిలో 8 మంది పోలీసులు హతం కావడం, వికాస్ దూబ్ మృతి సంఘటనలపై కమిటీ వేసే ఆలోచనలో సుప్రీంకోర్టు ఉన్నట్లు అర్థమవుతోంది.

పోలీసుల హత్య, వికాస్ దూబే హతం సంఘటనల విచారణను సీబీఐకి లేదా ఎన్ఐఏకు అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఏ విధమైన కమిటీ వేయాలో చెప్పాల్సిందని ఆదేశిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి గురువారం వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. 

Also Read: వికాస్ దూబే మరో అనుచరుడు అరెస్ట్: 11 మంది కోసం గాలింపు చర్యలు

తెలంగాణ కేసులో ఏం చేశారో అలాంటిదే చేయాలని తాము అనుకుంటున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఏ విధమైన కమిటీ కావాలో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. తెలంగాణ వెటర్నిరీ డాక్టర్ పై అత్యాచారం ఆమె హత్య తర్వాత సంభవించిన పరిణామాలను ప్రస్తావిస్తూ ఆయన ఆ విధంగా అడిగారు. 

వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో నిందితులైన నలుగురు రాళ్లు, కర్రలతో తమపై దాడి చేశారని, ఆ తర్వాత ఆయుధాలు లాక్కున్నారని, తమపై కాల్పులు జరపడంతో తాము ఎదురుకాల్పులు జరపక తప్పలేదని, ఈ ఎదురు కాల్పుల్లో నిందితులు మరణించారని తెలంగాణ పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. 

Also Read: విస్తుపోయే వికాస్ దూబే ఆదాయం: ఎలా ఖర్చు చేసేవాడో.....

ఆ తెలంగాణ సంఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పూర్కార్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ కారణంగా ఆ కమిటీ ఇప్పటి వరకు నివేదికను సమర్పించలేకపోయింది.

వికాస్ దూబే కేసు విషయంలో సమాధాన ఇవ్వడానికి తమకు మరింత సమయం ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును కోరారు.