మావోయిస్టులతో సంబంధాల కేసులో జీఎన్ సాయిబాబా, ఇతరులను నిర్దోషులుగా పేర్కొంటూ వారిని వెంటనే విడుదల చేయాలని జారీ చేసిన బాంబే హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో వారు జైలులోనే కొనసాగనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన దరఖాస్తుపై డిసెంబర్ 8న విచారించనుంది. ఇందుకు సమాధానం ఇవ్వాలని జీఎన్ సాయిబాబా సహా ఇతరులకు నోటీసులు పంపింది.
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా జైలులోనే ఉండనున్నారు. ఈ కేసులో జీఎన్ సాయిబాబా, ఇతరులను బాంబే హైకోర్టు నిన్న (శుక్రవారం) నిర్దోషులుగా ప్రకటించింది. వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. కానీ, సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను సస్పెండ్ చేసింది. జీఎన్ సాయిబాబా, ఇతరుల విడుదలపై స్టే విధించింది.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వాన్ని కూల్చేయాలని కుట్ర చేశారన్న అభియోగాల్లో జీఎన్ సాయిబాబా, ఇతరులను సెషన్స్ కోర్టు దోషులుగా తేల్చింది. జీఎన్ సాయిబాబాకు యావజ్జీవ శిక్ష విధించింది. 2014లో అరెస్టు అయిన జీఎన్ సాయిబాబా ఇప్పటి వరకు నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.
Also Read: ప్రొఫెసర్ సాయిబాబాకు ఊరట.. నిర్దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు...వెంటనే విడుదలకు ఆదేశాలు..
వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు తీర్పు ఇవ్వగానే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. కానీ, జస్టిస్ డీవై చందర్చూడ్, జస్టిస్ హిమా కోహ్లీల ధర్మాసనం అందుకు తిరస్కరించింది. బాంబే హైకోర్టు ఆర్డర్ పై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం ఓ దరఖాస్తును రిజిస్ట్రీకి ఇచ్చి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చని వివరించింది.
Also Read: https://telugu.asianetnews.com/national/supreme-court-granted-bail-to-social-activist-and-poet-varavara-rao-rge7ppవిప్లవ కవి వరవరరావుకు బెయిల్: సుప్రీంకోర్టు షరతులు ఇవీ
అనంతరం, అర్జెంట్ హియరింగ్‌కు సుప్రీంకోర్టు అంగీకరించింది. నిన్న శనివారం, సుప్రీంకోర్టుకు సెలవు రోజు. అయినప్పటికీ ప్రత్యేక ధర్మాసనం ఈ దరఖాస్తును అత్యవసరంగా విచారించడానికి అంగీకరించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ఈ మహారాష్ట్ర దరఖాస్తును స్వీకరించింది. బాంబే హైకోర్టు జారీ చేసిన విడుదల ఆదేశాలపై స్టే ఇచ్చింది. జీఎన్ సాయిబాబా సహా ఇతరులు జైలులోనే ఉండాలని పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ పై సమాధానం ఇవ్వాలని వారికి నోటీసులు పంపింది. డిసెంబర్ 8వ తేదీన ఈ దరఖాస్తును ధర్మాసనం విచారించనుంది.
