Asianet News TeluguAsianet News Telugu

ప్రొఫెసర్ సాయిబాబాకు ఊరట.. నిర్దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు...వెంటనే విడుదలకు ఆదేశాలు..

మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను నిర్దోషిగా తేలుస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తీర్పునిచ్చింది. 

Ex Professor GN Saibaba Acquitted In Alleged Maoist Links Case
Author
First Published Oct 14, 2022, 11:53 AM IST

ముంబాయి : మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ శుక్రవారం నిర్దోషిగా ప్రకటించింది. అతడిని దోషిగా నిర్ధారిస్తూ, జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆయన చేసిన అప్పీల్‌ను కూడా కోర్టు అనుమతించింది. జస్టిస్ రోహిత్ డియో, జస్టిస్ అనిల్ పన్సారేలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా అనుమతించి వారిని కూడా నిర్దోషులుగా ప్రకటించింది. మరే ఇతర కేసుల్లో నిందితులుగా లేని పక్షంలో దోషులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.

శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌కు అంకితమైన జీఎన్ సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై 2014 మేలో అరెస్టయ్యాడు. అరెస్టుకు ముందు సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీలోని రామ్ లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లీష్ బోధించేవారు.  జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి హేమంత్ మిశ్రా అరెస్టు తర్వాత సాయిబాబాను అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మద్ అడవుల్లో మావోయిస్టులకు, ప్రొఫెసర్‌కు మధ్య తాను కొరియర్‌గా వ్యవహరిస్తున్నట్లు దర్యాప్తు సంస్థల ముందు హేమంత్ మిశ్రా చెప్పడంతో అరెస్ట్ చేశారు. 

ప్రొఫెసర్ సాయిబాబాకు జీవితఖైదు

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పోలీసులు సాయిబాబా నిషేధిత సంస్థకు ఓవర్‌గ్రౌండ్ వర్కర్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్ సిపిఐ-మావోయిస్ట్‌కు ఫ్రంట్‌గా పనిచేస్తున్న సంస్థను నడుపుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు, దీనిని సాయిబాబా ఖండించారు. 2012లో రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో నిషేధించబడిన మావోయిస్టుల ఫ్రంట్ ఆర్గనైజేషన్) సదస్సులో సాయిబాబా పాల్గొన్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. "సాయిబాబా డిప్యూటీ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. 'నక్సలిజమే ఏకైక మార్గం.. ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటును ఖండించాలి' అని ఆయన ప్రసంగించారు. ఈ వీడియోలన్నీ కోర్టులో ప్లే చేయబడ్డాయి" అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని సెషన్స్ కోర్టులో 2017లో కేసు విచారణ జరిగింది.

సాయిబాబా నేపాల్, శ్రీలంక లాంటి వివిధ దేశాలకు చెందిన మావోయిస్టులతో టచ్‌లో ఉన్నారని ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA), ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని వివిధ నిబంధనల ప్రకారం సాయిబాబాను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో అతడితోపాటు మరో ముగ్గురు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.

ఇక ఈ కేసును పరిశీలించిన ధర్మాసనం మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు. దోషులు మరే ఇతర కేసులో నిందితులుగా ఉంటే తప్పా వారిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

మార్చి 2017లో, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు సాయిబాబాతో పాటు మరికొందరిని దోషులుగా నిర్ధారించింది, అందులో ఒక జర్నలిస్టు, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థి సహా మరికొందరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత 2017 మార్చిలో సెషన్స్ కోర్టు వీరికి జీవిత ఖైదు విధించింది. అప్పటినుంచి వీరు నాగ్ పూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. జీవితఖైదును సవాల్ చేస్తూ సాయిబాబా సహా మిగతా దోషులు బాంబే హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. 

ఇదిలా ఉండగా, 2014లో సాయిబాబా అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ ఆయనను సస్పెండ్ చేసింది. నిరుడు ఆయనను పూర్తిగా విధులనుంచి తొలగించింది. మరి ఇప్పుడు ఈ తీర్పు నేపథ్యంలో మళ్లీ ఆయనను విధుల్లోకి తీసుకుంటారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios