Asianet News TeluguAsianet News Telugu

ఆ నిందితుడిని రక్షించడానికేనా?.. లఖింపూర్ ఖేరి కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం

లఖింపూర్ ఖేరి కేసులో సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు ఎఫ్ఐఆర్‌లను ఓవర్‌లాప్ చేసేది కేవలం ఒక నిందితుడిని రక్షించడానికే అన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తున్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే ఈ కేసులో చార్జిషీటు దాఖలయ్యే వరకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.
 

supreme court slams uttar pradesh for probe in lakhimpur kheri case
Author
New Delhi, First Published Nov 8, 2021, 3:06 PM IST

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన Lakhimpur Kheri కేసులో Supreme Court ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు తీరుపై తీవ్ర అసంతృప్తి తెలిపింది. తాము ఆశించిన స్థాయిలో దర్యాప్తు జరగడం లేదని తెలిపింది. అందుకే ఈ కేసులో Charge Sheet దాఖలయ్యే వరకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి దర్యాప్తును పర్యవేక్షించడం సమంజసంగా తోస్తున్నదని వివరించింది. అంతేకాదు, కేసులోని ప్రధాన నిందితుడిని రక్షించేలా చర్యలు జరుగుతున్నట్టు అనుమానాలు వస్తున్నాయని తెలిపింది.

లఖింపూర్ ఖేరి కేసులో Uttar Pradesh ప్రభుత్వం ఊహించిన స్థాయిలో దర్యాప్తు నిర్వహించడం లేదని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్‌వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కేసులో దర్యాప్తు పురోగతిని అడిగిన ప్రతిసారీ మరికొంత మంది సాక్షులను చేర్చామని, వారిని ప్రశ్నిస్తున్నామనే సమాధానమే వస్తున్నదని వివరించింది. కానీ, కేసులో ఎంత మంది అరెస్టు అయ్యారని, ఏ అభియోగాల కింద అరెస్టులు జరిగాయనే విషయాలపై స్పష్టమైన సమాధానలు ఇవ్వడం లేదని మండిపడింది. ఈ కేసులో తాము ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా దర్యాప్తు జరగగడం లేదని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. 

Also Read: లఖింపుర్ కేసు.. ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడికి డెంగ్యూ.. ఆస్పత్రికి తరలింపు..

అంతేకాదు, రెండు ఎఫ్ఐఆర్‌లను కలిపే నిర్ణయంలో దురుద్దేశ్యాలు ఉన్నట్టు సుప్రీంకోర్టు అనుమానించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కొడుకు అశిశ్ మిశ్రాను కాపాడే లక్ష్యంతోనే రెండు ఎఫ్ఐఆర్‌లను కలుపుతున్నట్టు అభిప్రాయపడింది. ఈ ఘటనలో లభించిన ఆధారాలు రెండు కేసులకూ వర్తిస్తాయని ఉత్తరప్రదేశ్ ఇది వరకే వివరించిన సంగతి తెలిసిందే. రెండు ఎఫ్ఐఆర్‌లను ఓవర్‌లాప్ చేయడం వెనుక ప్రధాన నిందితుడిని కాపాడాలనే లక్ష్యం ఉన్నట్టు ప్రాథమికంగా అర్థమవుతున్నదని న్యాయమూర్తి సూర్యకాంత్ తెలిపారు. ఈ రెండు ఎఫ్ఐఆర్‌లను వేర్వేరుగా విచారించాలని సీజే ఎన్వీ రమణ ఇది వరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహించడం ఇది మూడోసారి.

Lakhimpur Kheri: 23 మంది సాక్షులేనా? ప్రశ్నించిన సుప్రీంకోర్టు

ఉత్తరప్రదేశ్ తీసుకున్న చర్యలపై సీజే ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమా కోహ్లీల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అందుకే ఈ కేసులో చార్జిషీటు దాఖలయ్యే వరకు హైకోర్టు మాజీ న్యాయమూర్తిని పర్యవేక్షించడం సముచితమని తెలిపింది. అంతేకాదు, పంజాబ్, హర్యానా హైకోర్టుల మాజీ న్యాయమూర్తుల పేర్లను సూచించింది కూడా. రిటైర్డ్ న్యాయమూర్తులు రాకేశ్ కుమార్ జైన్, రంజిత్ సింగ్‌లను పర్యవేక్షక అధికారిగా నియమించుకోవడం మంచిదని వివరించింది.

గతనెల ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైతు ఆందోళనకారులపైకి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో ఎనిమిది మంది మరణించారు. ఇందులో నలుగురు రైతులు ఉన్నారు. అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రా కారు రైతు ఆందోళనకారులపై వెళ్లినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సుమోటుగా ఈ కేసును స్వీకరించింది. ఇటీవలి వారాల్లోనే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ దర్యాప్తుపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం ఇది మూడోసారి.

Follow Us:
Download App:
  • android
  • ios