ఢిల్లీలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే దీనిపై జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 

దేశవ్యాప్తంగా పెరుగుతున్న వీధికుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెరిగిన దాడులు, రేబిస్‌ కేసులు, ప్రజల ప్రాణ భద్రతపై ఆందోళనలు దృష్ట్యా, కోర్టు ఈనెల 11న ఇచ్చిన పూర్వ ఆదేశాలను సవరించి తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ చీఫ్ సెక్రటరీలకు నోటీసులు కూడా పంపింది.

స్టెరిలైజేషన్‌ తప్పనిసరి

సుప్రీంకోర్టు ప్రకారం వీధికుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారంగా స్టెరిలైజేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపింది. కుక్కలను పట్టుకుని శస్త్రచికిత్స చేసి మళ్లీ అదే ప్రదేశంలో వదలాలని స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. ఈ విధానం ద్వారా కొత్తగా పుట్టే కుక్కల సంఖ్య తగ్గి, భవిష్యత్తులో వీధులపై కుక్కల నియంత్రణ సాధ్యమవుతుందని కోర్టు అభిప్రాయం.

దాడి చేసే, రేబిస్‌ ఉన్న కుక్కలకు షెల్టర్‌లు

అయితే, అన్ని కుక్కలను వదిలేయకూడదని సుప్రీం సూచించింది. మనుషులపై దాడి చేసే కుక్కలు, రేబిస్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు ఉన్న కుక్కలు తప్పనిసరిగా షెల్టర్ హోమ్‌లలో ఉంచాలని తెలిపింది. ప్రజల భద్రత ప్రధానమని, స్థానిక సంస్థలు ఈ అంశాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.

బహిరంగప్రదేశాల్లో ఆహారం నిషేధం

తాజా తీర్పులో మరో కీలక అంశం.. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టరాదు. రోడ్లపై, పార్కుల్లో, అపార్ట్‌మెంట్ ప్రాంగణాల్లో ఆహారం పెట్టడం వల్ల కుక్కలు గుంపులుగా చేరి దాడులు చేసే అవకాశాలు పెరుగుతున్నాయని కోర్టు గమనించింది. కుక్కలను ప్రేమించే వారు ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాల్లో మాత్రమే ఆహారం పెట్టాలని సూచించింది.

గత తీర్పులు, వివాదాలు

వీధికుక్కల సమస్య కొత్తది కాదు. 2015లో కూడా సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణ జరిపి, Animal Birth Control (ABC) Programme అమలు చేయాలని సూచించింది. అయితే అమలులో లోపాల కారణంగా సమస్య మరింత పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో కుక్కల దాడుల కారణంగా చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకోవడంతో మళ్లీ ఈ అంశం కోర్టు ముందు వచ్చింది. ఈసారి కోర్టు మరింత కఠినంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాలపై బాధ్యతను అప్పగించింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ సీఎస్‌లకు నోటీసులు జారీ చేసింది.