Asianet News TeluguAsianet News Telugu

సీఏఏ వ్య‌తిరేక పిటిషన్ల విచార‌ణ సెప్టెంబర్ 19కి వాయిదా: సుప్రీంకోర్టు

Citizenship Law: డిసెంబర్ 2019లో పౌర‌స‌త్వ (స‌వ‌ర‌ణ‌) చట్టానికి (సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి, పోలీసు కాల్పుల్లో ఐదుగురు మరణించారు. చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ ఈశాన్య భార‌తంలో సీఏఏ వ్య‌తిరేక నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి.
 

Supreme Court adjourned the hearing of the anti-CAA petitions to September 19
Author
First Published Sep 12, 2022, 3:52 PM IST

Supreme Court: పౌరసత్వ (సవరణ) చట్టం-2019ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు సోమవారం వాయిదా వేసి, తదుపరి విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం సీఏఏను సవాలు చేస్తూ దాఖలైన 220 పిటిషన్లను విచారించింది. సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు మొదట డిసెంబర్ 18, 2019న సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి. కాగా, పౌర‌స‌త్వ (స‌వ‌ర‌ణ‌) బిల్లును డిసెంబర్ 11, 2019న పార్లమెంటు ఆమోదించింది. అయితే, దీనిని వ్య‌తిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప‌లువురు కోర్టుల‌ను ఆశ్ర‌యించారు. ఈ నిర‌స‌న‌ల మ‌ధ్య‌నే సీఏఏ 10 జనవరి 2020 నుండి అమలులోకి వచ్చింది.

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్, AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ నాయకుడు దేబబ్రత సైకియా, అనేక NGOలు, న్యాయ విద్యార్థులు పౌర‌స‌త్వ (స‌వ‌ర‌ణ‌) చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. అయితే, 2020లో కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో  సీఏఏను వ్య‌తిరేకిస్తూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీంతో సీఏఏను సవాలు చేసిన మొదటి రాష్ట్రంగా కేర‌ళ అవతరించింది. కాగా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లలో మతపరమైన హింస నుండి పారిపోయి, డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు భారతదేశంలో ఆశ్రయం పొందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు పౌరసత్వం మంజూరు చేసేందుకు ప్ర‌భుత్వం దీనిని తీసుకువ‌చ్చింది. అయితే, ఇందులో నుంచి ముస్లింల‌ను మిన‌హాయించారు. మ‌త‌ప్రాతిప‌దిక‌న పౌర‌స‌త్వం క‌ల్పించ‌డంపై వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌ది. సుప్రీంకోర్టు గతంలో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే, సీఏఏ అమ‌లుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.

సీఏఏను సవాల్ చేస్తూ పిటిషనర్లలో ఒకరైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) తన పిటిషన్‌లో సమానత్వం ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుందనీ, మ‌తం ఆధారంగా బహిష్కరించడం ద్వారా అక్రమ వలసదారులకు ప్రధాన కారణాలలో ఒకటని పేర్కొంది. అంద‌రికి స‌మానంగా పౌర‌స‌త్వం క‌ల్పించాల‌ని కోరింది. కాగా, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన పౌర‌త‌స్వ (స‌వ‌ర‌ణ‌) చ‌ట్టం (సీఏఏ)కు వ్య‌తిరేకంగా దేశంలో పెద్దఎత్తున నిర‌స‌న‌లు చెల‌రేగాయి. నిరసనకారుల ఆందోళనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా నిరసనలు వేగంగా చెలరేగాయి . జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరసనలు, గౌహతి, మేఘాలయ, కేరళ, షాహీన్ బాగ్ (న్యూఢిల్లీ), కోల్‌కతాలు స‌హా దేశంలోని అనేక ప్రాంతాల్లో సీఏఏ వ్య‌తిరేక నిర‌స‌న‌లు తీవ్ర ఉద్రిక్త‌ల‌కు కార‌ణ‌మ‌య్యాయి. డిసెంబర్ 2019లో ఈ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి, పోలీసు కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ ఈశాన్య భార‌తంలో సీఏఏ వ్య‌తిరేక నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios