ఒడిశా రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.10 కోట్లు విరాళంగా ఇస్తున్నట్టు ఆర్థిక నేరాల కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ అన్నారు. ఈ డబ్బు చట్టబద్ధంగా సంపాదించాని, దీనిని స్వీకరించాలని ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు.
రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా నిలవాలని కోరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు అందించడానికి భారతీయ రైల్వేకు రూ.10 కోట్లు విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ మొత్తాన్ని స్వీకరించడానికి అనుమతి కోరుతూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాశారు. ఈ నిధి తన "చట్టబద్ధమైన ఆదాయ వనరు" నుండి వచ్చిందని పేర్కొన్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-డంపర్ ఢీ.. ముగ్గురు మృతి.. ఏడుగురికి గాయాలు
ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువుల కోసం ఈ నిధిని ఉపయోగించవచ్చని సుఖేష్ తన లేఖలో పేర్కొన్నారు. రైలు ప్రమాదాన్ని దురదృష్టకరమైన ప్రమాదంగా అభివర్ణించిన సుఖేష్, ఈ విషాదం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఆ సోదరీమణులు, సోదరులు, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.
‘‘ఈ కంట్రిబ్యూషన్ నా వ్యక్తిగత నిధుల నుండి వచ్చింది. ఇది నా చట్టబద్ధమైన ఆదాయ వనరు నుండి వచ్చింది. దీనికి పూర్తిగా ట్యాక్స్ కట్టాను. రూ .10 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్ తో పాటు రిటర్న్స్ ఫైలింగ్ తో పాటు డాక్యుమెంటేషన్ కూడా సమర్పించాను.’’ అని చంద్రశేఖర్ అన్నారు.
బాధ్యతాయుతమైన పౌరుడిగా ఇస్తున్నా..
‘‘మన ప్రభుత్వం ఇప్పటికే బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుస్తోంది. అయితే బాధ్యతాయుతమైన మంచి పౌరుడిగా నేను ఈ రూ.10 కోట్ల నిధిని ప్రత్యేకంగా వారి కుటుంబాలు, పిల్లలు, మన భావి యువత కోసం, వారి విద్యా ఖర్చుల కోసం ఉపయోగించడానికి విరాళం ఇస్తున్నాను. పాఠశాల, హైస్కూల్, కళాశాల విద్య వంటి ప్రతి చిన్నారి విద్యా ఖర్చుల కోసం ప్రత్యేకంగా ఈ విరాళాన్ని ఉపయోగించాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. ‘‘దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో శారద ఫౌండేషన్, చంద్రశేఖర్ క్యాన్సర్ ఫౌండేషన్, ఎల్ఎస్ ఎడ్యుకేషన్ అనే నా సంస్థ ఆరోగ్య సంరక్షణ, విద్య, ప్రధానంగా ఆహార సహకారం అందిస్తోంది.’’ అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ప్రధాని మోదీపై సుఖేశ్ చంద్రశేఖర్ ప్రశంసలు
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), అరవింద్ కేజ్రీవాల్ లపై విమర్శలు గుప్పిస్తూ లేఖలు రాస్తున్న సుఖేష్ చంద్రశేఖర్.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. సకాలంలో పరిస్థితిని స్వయంగా నియంత్రించి, ప్రమాదంలో బాధితులందరికీ అండగా నిలిచి, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకున్న ప్రధాని నాయకత్వంలో ప్రభుత్వం ఉండటం చాలా గర్వంగా ఉందన్నారు.
‘అలా చేస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయబోం’ - కాంగ్రెస్ కు ఆప్ మెగా ఆఫర్
కాగా.. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల నుంచి సుఖేష్ చంద్రశేఖర్ డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఫార్మా కంపెనీ రాన్బాక్సీ మాజీ యజమాని శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ ను రూ.200 కోట్లు మోసం చేశాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా నిందితురాలిగా ఉన్నారు.
