ఆంధ్రప్రదేశ్ నుంచి విమానంలో బెంగళూరు వెళ్లి.. ఖరీదైన చీరలు దొంగతనం చేస్తున్న ఓ లేడీ గ్యాంగ్ ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్ణాటక : దొంగలు రోజురోజుకీ తెలివి మీరి పోతున్నారు. వీరు చేస్తున్న దొంగతనాలు తీరు చూస్తే అవాక్కై, ముక్కు మీద వేలేసుకుంటారు. దొంగతనం చేయడం కోసం లక్షలు పోసి జ్యోతిష్కుడుతో మంచి ముహూర్తం పెట్టించుకున్న ఘటన వెలుగు చూసిన కొద్ది రోజుల్లోనే.. మరో షాకింగ్ దొంగతనం ఘటన.. వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విమానంలో బెంగళూరుకు వచ్చి బట్టల షాపుల్లో దొంగతనాలు చేస్తుందో కిలాడి లేడీ ముఠా.. షాపింగ్ పేరుతో బట్టల షాపుల్లోకి దూరి ఖరీదైన చీరలను దొంగతనం చేస్తున్నారు.
ఆదివారం కర్ణాటకలోని బనశంకరి అశోక్ నగర పోలీసులు ఈ కిలేడి ముఠాను అరెస్టు చేశారు. విచారణలో వీరు చెప్పిన వివరాలు విని పోలీసులు అవాక్కయ్యారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళలే. ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన రమణి, రత్నాలు, చుక్కమ్మలు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి విమానంలో వీరు బెంగుళూరుకు వస్తారు. ఆ తర్వాత ఇక్కడ స్కార్పియో కారులో తిరుగుతారు. అలా.. ఖరీదైన మాల్ లోకి ఎంటర్ అవుతారు. ఖరీదైన చీరలు కొనే నెపంతో సిబ్బంది కళ్ళు కప్పి ఖరీదైన చీరలను మాయం చేయడంలో వీరు ఆరితేరిన వారిని పోలీసులు చెప్పుకొచ్చారు. వీరు బాగా డబ్బున్న వారిలాగా ఒంటినిండా బంగారు నగలు వేసుకుని షాపులకు వెళుతుంటారు.
అక్కడ వారిని ఖరీదైన చీరలను చూపించాలని అడుగుతారు. వారు చూపిస్తున్న క్రమంలోనే మరిన్ని చీరలు చూపించాలని కోరుతారు. వారి కోరిక మేరకు మరిన్ని చీరలు తేవడానికి సిబ్బంది షాపులోని స్టోర్ రూమ్ లోకి వెళ్లిన సమయంలో.. చీరల బండిల్స్ ని కాళ్ళ మధ్యలో దాచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. ఈ క్రమంలో ఓ షాపులో ఇలాగే దొంగతనం చేసి వెళుతున్న సమయంలో ఓ మహిళ కాలి దగ్గర చీర ఉన్నట్లుగా షాపు సెక్యూరిటీ గమనించాడు.
వెంటనే ఈ విషయాన్ని యజమానికి తెలిపాడు. దీంతో అనుమానించిన యజమాని వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించాడు. అందులో ఆ మహిళలు చేసిన దొంగతనం వెలుగు చూసింది. వెంటనే సీసీటీవీ ఫుటేజీ లన్నింటిని అశోక్ నగర పోలీస్ స్టేషన్ లోని పోలీసులకు ఇచ్చి మహిళలపై ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం నాడు లేడీ గ్యాంగును అరెస్టు చేశారు. ఈ మహిళల మీద అశోక్ నగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరి దగ్గరి నుంచి రూ.14 లక్షల విలువ చేసే చీరలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు సంబంధించి విచారణ చేపట్టారు.
