వివాదాస్పద సమాజ్ వాదీ పార్టీ నాయకులు ఆజం ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన యూపీలోని ప్రముఖ పర్యాటక కట్టడం తాజ్ మహల్ పై మాట్లాడి వివాదానికి తెరలేపారు. తాను తాజ్ మహల్ ను కూల్చడానికి సిద్దమే అంటూ బాంబ్ పెల్చారు. అయితే దానికి యూపీ సీఎం ఆదిత్యనాథ్ ముందుంటే ఆ తర్వాత తానే ఉంటానని ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు తాజ్ మహల్ శివాలయమని యూపి సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు చాలామంది తనతో చెప్పారని ఆజంఖాన్ అన్నారు. వారు కోరుకున్నట్లే తాజ్ మహల్ ను కూల్చేసి శివాలయ నిర్మాణానికి తాను కూడా సహకరిస్తానని తెలిపారు. అయితే ఈ కూల్చివేతలో ఆ కట్టడంపై యోగి మొదటి దెబ్బ వేస్తే తాను రెండో దెబ్బ వేయడానికి సిద్దంగా ఉన్నానని ఆజం ఖాన్ పేర్కొన్నారు.

తానొక్కడినే కాదు తనతో పాటు మరో 20 వేల మంది  ఈ కూల్చివేతలో యోగితో కలిసి నడిచేందుకు సిద్దంగా ఉన్నారని ఆజం ఖాన్ అన్నారు. తాజ్ మహల్ ను పూర్వం శివాలయంగా పేర్కొంటున్నారు కాబట్టి మళ్లీ శివాలయం నిర్మించడానికి కూడా తాను సహకరిస్తానని ఈ సమాజ్ వాది పార్టీ మైనారిటీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.