పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను కోరిన సోనియా: మోడీకి లేఖ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ఇవాళ లేఖ రాశారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బుధవారంనాడు లేఖ రాశారు.ఈ నెల 18వ తేదీ నుండి నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన ఎజెండా ఇవ్వాలని ఆమె ఆ లేఖలో కోరారు.పార్లమెంట్ సమావేశాల ఎజెండాలో తొమ్మిది అంశాలను చేర్చాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.అదానీ, మణిపూర్ అంశం, రైతు సమస్యలను ఎజెండాలో చేర్చాలని సోనియా గాంధీ కోరారు. కనీస మద్దతు ధర, కులాల వారీగా జనగణనను ఎజెండాను చేర్చాలని ఆమె కోరారు.
ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు చర్చించారు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఎజెండాను వెల్లడించాలని సోనియా గాంధీ ఆ లేఖలో కోరారు. ఎజెండా ప్రకటించకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడంపై కేంద్రం తీరుపై విపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సంబంధించి కూడ ఏ పార్టీతో కూడ కేంద్రం సంప్రదింపులు జరపలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఎజెండాను బహిర్గతపర్చకపోవడం వాస్తవ సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడమేనని ఖర్గే పేర్కొన్నారు.
also read:పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. సోనియా నివాసంలో కీలక భేటీ
ఒకే దేశం, ఒకే ఎలక్షన్ కు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశ పెట్టే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కూడ కమిటీని కేంద్రం ఇటీవల ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఈ నెల 18నుండి 22 వరకు పార్లమెంట్ కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ విషయమై ఇటీవల కేంద్ర పార్లమెంట్ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ట్వీట్ చేశారు. ఈ సమావేశాల ఎజెండాను త్వరలోనే చెబుతామన్నారు. అయితే ఇప్పటివరకు ఎజెండా ప్రకటించకపోవడంపై విపక్ష పార్టీలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.