సారాంశం

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్‌లోని సభ్యులకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేస్తున్నారు. భారత్‌గా పేరు మార్పు, ఒక దేశం ఒకే ఎన్నిక, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై చర్చిస్తున్నారు. ఈసారి పార్లమెంట్ సెషన్‌లో ప్రశ్నోత్తరాలకు ఛాన్స్ లేదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సోనియా సూచనలు చేస్తున్నారు. ఆ వెంటనే ఇండియా కూటమిలోని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భేటీ కానున్నారు. 

అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన ప్రత్యర్థులను కూడా తన గురువులుగా భావిస్తానని అన్నారు. "భార‌త జాతిపిత మహాత్మాగాంధీ, గౌతమ బుద్ధుడు, శ్రీ నారాయణ గురు వంటి మహానుభావులను తాను గురువులుగా భావిస్తాననీ, సమాజంలోని ప్రజలందరి సమానత్వం గురించి జ్ఞానాన్ని మనకు అందించారనీ, ప్రతి ఒక్కరి పట్ల కరుణ, ప్రేమను చూపించారని" రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Also Read: నా ప్రత్యర్థులు కూడా నా గురువులే.. : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ

ఫేస్ బుక్ ఒక పోస్టులో రాహుల్ గాంధీ స్పందిస్తూ.. "ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ నా వందనాలు. భారత మాజీ రాష్ట్రపతి డా. సర్వపల్లి రాధాకృష్ణన్ జీ జయంతి సందర్భంగా వారికి వినమ్ర నివాళి. జీవితంలో గురు స్థానం ఎంతో ఉన్నతమైనది, మీ జీవన మార్గాన్ని వెలిగించేది, మిమ్మల్ని సన్మార్గంలో నడవడానికి ప్రేరణ నిస్తుంది. సమాజంలో ప్రజల సమానత్వ జ్ఞానాన్ని, అందరి పట్ల కరుణ, ప్రేమను అందించిన మహాత్మాగాంధీ, గౌతమ్ బుద్ధ, శ్రీ నారాయణ గురు వంటి మహానుభావులను నేను గురుగా భావిస్తున్నాని" పేర్కొన్నారు.

అలాగే, "భారతదేశ ప్రజలు కూడా గురువులు, మన దేశ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం, ప్రతి సమస్యను ధైర్యంగా పోరాడేలా స్ఫూర్తినిచ్చేవారు, వినయానికి తపస్సుకు నిలువెత్తు రూపం. నేను నడిచే దారి పరిపూర్ణమైనది.. ముందుకు సాగడానికి ఖర్చు తక్కువే అని బోధించే నా ప్రత్యర్థులను కూడా గురువుగా భావిస్తాను" అని రాహుల్ గాంధీ అన్నారు.