ప్రత్యేక పార్లమెంటు సమావేశాల కోసం కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూపుతో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ సమావేశం కానున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ భేటీ ఉంది. అలాగే.. ఇండియా కూటమి ఎంపీలతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమావేశానికి పిలుపు ఇచ్చారు. 

న్యూఢిల్లీ: ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు కూడా ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ లీడర్ సోనియా గాంధీ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్‌తో సమావేశానికి పిలుపు ఇచ్చారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం ఉంటుంది. ఇందులో ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుగుతుంది.

విపక్షాలన్నీ ఇండియా కూటమిగా ఏకమైన సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక సమావేశాల్లోనూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సమైక్యంగా నిలబడి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నాయి. అందుకే భావసారూప్య పార్టీల ఎంపీలతోనూ సమావేశానికి కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రత్యేక సమావేశాల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై చర్చించడానికి ఇండియా కూటమి ఎంపీలతో సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపు ఇచ్చారు. ఈ సమావేశంలో సంయుక్త వ్యూహానికి చర్చ జరగనుంది.

Also Read: ముందే ప్రత్యేక సమావేశాలపై ఉత్కంఠ.. ఆపై అజెండాలో ముఖ్యమైన అంశాలుంటాయని కేంద్రం మంత్రి బాంబ్..

బిజెపి 9 ఏళ్ల పాలనలో ఎన్నడూ కూడా ఇలాంటి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించలేదు. ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకు ముందు జీఎస్టీ అమలు చేయడానికి 2017 జూన్‌ 30న ప్రత్యేకంగా అర్థరాత్రి సమయంలో పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. అయితే.. ఈ సారి మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా పూర్తిస్థాయిలో లోక్‌సభ, రాజ్యసభలు వేర్వేరుగా ఐదు రోజుల పాటు సమావేశం కానున్నాయి.