సోనియా గాంధీని త్వరలోనే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ భావిస్తున్నది. త్వరలో ముగ్గురు ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగిసిపోనుంది. వారి స్థానంలో మరో ఇద్దరితోపాటు సోనియా గాంధీని కూడా రాజ్యసభకు గెలిపించి పంపించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలిసింది. 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మీడియా ముందుకు కూడా చాలా వరకు రావడం లేదు. లోక్ సభ ఎన్నికల్లోనూ పోటీకి ఆమె నిరాకరించారు. మొన్నటి బెంగళూరులోని విపక్షాల సమావేశాలకు ఆమె హాజరవడం ప్రతిపక్ష శిబిరాల్లో ఒక కొత్త భరోసా వచ్చినట్టయింది. ఆ భేటీతో మరోసారి ఆమె వార్తల్లోకి వచ్చారు. గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో ఆమెను మళ్లీ పార్లమెంటుకు పంపించాలనే చర్చ జరుగుతున్నది. ఆ మేరకు కాంగ్రెస్ ప్రయత్నాలు కూడా చేస్తున్నదని తెలుస్తున్నది.

కొంత కాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె లోక్ సభ ఎన్నికల బరిలో నిలవడం అసాధ్యం. కానీ, కాంగ్రెస్ ఆమెను పార్లమెంటుకు పంపితే బాగుంటుందనే ఆలోచనల్లో ఉన్నాయి. అందుకే ఆమెను రాజ్యసభకు పంపించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అది కూడా కర్ణాటక నుంచే ఆమెను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలు వివరించాయి. 

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్వయంగా ఈ మేరకు సోనియా గాంధీకి ప్రతిపాదించినట్టు తెలిసింది. కర్ణాటకలో 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి, ముగ్గురు రాజ్యసభకు గెలిచే అవకాశం ఉన్నది. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యులైన సయ్యద నాసిర్, హుస్సేన్, డాక్టర్ ఎల్ హనుమంతయ్య, జీసీ చంద్రశేఖర్‌ల పదవీ కాలం 2024 ఏప్రిల్ 2వ తేదీతో ముగిసిపోనుంది. దీంతో ఈ స్థానాలకు మళ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి.

Also Read: దొంగల ఔదార్యం! ఇంట్లో దోచుకునేంత గొప్పవేమీ కనిపించకపోవడంతో రూ. 500 పెట్టి పరార్

ఈ ఎలక్షన్స్‌లో సోనియా గాంధీని ఎన్నుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. సోనియా గాంధీతోపాటు ఏఐసీసీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటి, సయ్యద్ నాసిర్ హుస్సేన్ మరోసారి రాజ్యసభకు పంపాలని యోచిస్తున్నట్టు రాజకీయవర్గాలు చర్చిస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా కర్ణాటక నుంచి సోనియా గాంధీ రాజ్యసభ కు వెళ్లాలని కోరినట్టు తెలిసింది.