Sonia Gandhi: సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు.
Sonia Gandhi : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ మరోసారి అనారోగ్యంతో ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో ఆదివారం రాత్రి అడ్మిట్ అయ్యారు. ఆమెకు పేగుల సంబంధిత సమస్యలు ఉండటంతో ఆసుపత్రి చేరారని సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ఆమెను పరీక్షించి, వైద్య పర్యవేక్షణలో ఉంచారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారిక ప్రకటనలో పేర్కొంది.
సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
వైద్యులు సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఆమెను గమనిస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థ పేర్కొంది. గత వారం కూడా సోనియా గాంధీ హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్‌లో సాధారణ వైద్య పరీక్షల కోసం చేరారు.

జూన్ 7న సిమ్లాలో సోనియా గాంధీ పరీక్షలు
జూన్ 7న, ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడకపోవడంతో సిమ్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు పరీక్షల అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ సీఎం మీడియా ప్రధాన సలహాదారు నరేశ్ చౌహాన్ మీడియాకు ధృవీకరించారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనూ, 78 ఏళ్ల సోనియా గాంధీ అదే గంగా రామ్ ఆసుపత్రిలో పేగుల సమస్యతో చేరారు. ఆమెకు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ సమీరన్ నండి వైద్యం అందించారు. ఆమెను ఒక రోజు తరువాత డిశ్చార్జ్ చేశారు.
మే 27న, భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని శాంతివన్‌లో జరిగిన కార్యక్రమంలో సోనియా గాంధీ చివరిసారిగా ప్రజల్లో కనిపించారు.
సోనియా గాంధీపై నేషనల్ హెరాల్డ్ కేసు ఆరోపణలు
ఇటీవల, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆరోపణల జాబితాలో చేర్చారు. యంగ్ ఇండియా ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) సంస్థకు సంబంధించిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులపై అక్రమ స్వాధీనంకు కుట్ర చేశారనే ఆరోపణలపై PMLA చట్టం కింద ప్రాసిక్యూషన్ ఫైలింగ్ జరిగింది.


