లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సీబీఐ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆదివారం అరెస్టు అయ్యే అవకాశం ఉందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ విషయంలో తనకు సమాచారం అందిందని చెప్పారు. 

ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ విచారణకు పిలిచిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం అరెస్టు చేస్తుందని తన వర్గాలు ధృవీకరించాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఏబీపీ నెట్ వర్క్ రెండో ఎడిషన్ ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా’ సమ్మిట్ లో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘మనీశ్ సిసోడియాను సీబీఐ విచారణకు పిలిచింది. ఆదివారం ఆయనను అరెస్టు చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం... ఇది చాలా బాధాకరం.’’ అని అన్నారు. 

యూపీ ఎమ్మెల్యే మర్డర్ కేసులో ప్రధాన సాక్షి దారుణ హత్య.. పట్టపగలే నడి రోడ్డుపై కాల్చివేత.. (వీడియో)

సిసోడియా నివాసంపై సీబీఐ దాడులు చేసి బ్యాంకు లాకర్లను తనిఖీ చేసిందని, కానీ ఏమీ దొరకలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘‘ మనీష్ సిసోడియాపై సీబీఐ దాడులు చేసింది. అతడి బ్యాంకు ఖాతాలను, ఇంటిని, అతడి లాకర్లను తనిఖీ చేసింది. అతడి కార్యాలయంపై దాడి చేసింది. అతడి గ్రామంలోని ఆస్తులపై దాడులు చేసింది. కానీ ఏమీ దొరకలేదు’’ అని సీఎం అన్నారు. 

ఢిల్లీలో విద్యావ్యవస్థను మెరుగుపరిచినందుకు ఉప ముఖ్యమంత్రిని ప్రశంసించిన కేజ్రీవాల్.. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తరువాత ఈ దేశంలోని పేద ప్రజలకు వారి పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశలు కల్పించిన వ్యక్తి మనీష్ సిసోడియా అని అన్నారు. నేడు ఢిల్లీలో పేదల పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అవుతున్నారని చెప్పారు. మనీష్ సిసోడియా వారికి ఎన్నో ఆశలు కల్పించారని కొనియాడారు.

ఏఐ కళ్లతో ఓల్డ్ ఢిల్లీ.. వెన్నులో వణుకుపుట్టిస్తున్న ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్

అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించి పరువు తీసేందుకు కుట్ర జరుగుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆయనను తప్పుడు కేసులో అరెస్టు చేసి జైల్లో పెడితే దేశం ఎలా పురోగతి సాధిస్తుందని ప్రశ్నించారు. ఒక దేశ రాజు ఆ దేశంలో పేదల పిల్లలకు విద్యను అందించే వారిని జైలుకు పంపి, దేశం మొత్తాన్ని ఇద్దరు, నలుగురు స్నేహితులకు అప్పగిస్తే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. 1999 డిసెంబర్ 29న తాను ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్నప్పుడే సిసోడియాను తొలిసారి కలిశానని కేజ్రీవాల్ చెప్పారు. 

ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 26న సీబీఐ తనను విచారణకు పిలిచిందని సిసోడియా గత సోమవారం చెప్పారు. కాగా.. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని సిసోడియాను సీబీఐ ఆదేశించింది. ప్రస్తుతం తాను బడ్జెట్ ను సిద్ధం చేస్తున్నానని, ఫిబ్రవరి నెలాఖరులో మాత్రమే విచారణకు హాజరుకాగలనని, విచారణను వాయిదా వేయాలని సిసోడియా గత ఆదివారం కేంద్ర దర్యాప్తు సంస్థను అభ్యర్థించారు.

ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న చిన్నారి మ్యాజిక్ ట్రిక్.. వీడియో వైరల్.. ఇంతకీ అందులో ఏముందంటే..

అయితే ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్ లో సిసోడియాను నిందితుడిగా పేర్కొనలేదు. అరెస్టయిన వ్యాపారవేత్తలు విజయ్ నాయర్, అభిషేక్ సహా ఏడుగురు నిందితులను చార్జిషీట్ లో చేర్చారు. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది ఆగస్టులో సిసోడియా బ్యాంకు లాకర్ ను సీబీఐ తనిఖీ చేసింది. కాగా.. తన లాకర్ లో ఎలాంటి ఆధారాలు లభించలేదని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.