జార్ఖండ్‌కు చెందిన ఎస్ఐ మనోజ్ కచ్ఛప్‌కు నిషేధిత మావోయిస్టు సంస్థ పీఎల్ఎఫ్ఐ సభ్యులతో సంబంధాలు ఉన్నట్టు తేలింది. కూంబింగ్ ఆపరేషన్లు, ఇతర కీలక విషయాలను వారితో పంచుకునేవాడని దర్యాప్తులో బయటపడింది. దీంతో ఆ ఎస్ఐని వెంటనే డిస్మిస్ చేశారు. 

రాంచీ: జార్ఱండ్‌లో ఓ ఎస్ఐకి నిషేధిత మావోయిస్టు సంస్థ పీఎల్ఎఫ్ఐతో సంబంధాలు ఉన్నట్టు తేలింది. 2018 పోలీసు బ్యాచ్‌కు చెందిన ఆ ఎస్ఐని డిస్మిస్ చేశారు. పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ గురించి, కీలకమైన రహస్య సమాచారాన్ని డిస్మిస్ అయిన ఎస్ఐ నిషేధిత సంస్థ సభ్యులతో పంచుకునేవాడని శాఖాపరమైన దర్యాప్తులో తేలింది. దీంతో సదరు అధికారిని వెంటనే డిస్మిస్ చేశారు.

ఎస్ఐ మనోజ్ కచ్ఛప్‌కు పీఎల్ఎఫ్ఐ మావోయిస్టు అవదేశ్ జైస్వాల్ అలియాస్ చుహా జైస్వాల్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నట్టు తేలింది. చుహా జైస్వాల్‌ను పోలీసులు 2022 ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. చుహా జైస్వాల్‌ను అధికారులు దర్యాప్తు చేయగా.. ఈ విషయం బయటపడింది. ఎస్ఐ మనోజ్ కచ్ఛప్‌తో తాను సన్నిహిత సంబంధాలను నెరిపానని జైస్వాల్ అధికారులకు తెలిపాడు. పోలీసుల్లో తమ లింక్ కచ్ఛప్ అని వెల్లడించాడు. మావోయిస్టులపై జరిపే కూంబింగ్ ఆపరేషన్ గురించి మనోజ్ కచ్ఛప్ ద్వారానే ఇన్‌పుట్లు తీసుకునేవాళ్లమని పేర్కొన్నాడు. ఆ ఆపరేషన్‌లలో మనోజ్ కచ్ఛప్ మావోయిస్టులకు సహకరించాడని వివరించాడు.

చుహా జైస్వాల్ ఈ విషయాలను వెల్లడించిన తర్వాత ఎస్ఐ మనోజ్ కచ్ఛప్ పై ఎస్పీ ఖుంతి అమన్ కుమార్ సమగ్ర శాఖాపరమైన దర్యాప్తును ఆదేశించారు. ఈ దర్యాప్తులోనూ ఎస్ఐ మనోజ్ కచ్ఛప్ దోషిగా తేలాడు. దీంతో ఈ ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్పీ అమన్ కుమార్ సిఫారసులు చేశారు.

Also Read: ఢిల్లీ టీనేజీ అబ్బాయిని హతమార్చిన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ సోదరుడు, లవర్: పోలీసులు

తాను మనోజ్ కచ్ఛప్‌ను డిస్మిస్ చేసినట్టు డీఐజీ రాంచీ అనుపర్ బర్తరే ఇండియా టుడేతో మాట్లాడుతూ తెలిపారు. ఎస్పీ ఖుంతి అమన్ కుమార్ సిఫారసుల మేరకు ఎస్ఐ మనోజ్ కుమార్‌ను డిస్మిస్ చేసినట్టు వివరించారు. శాఖాపరమైన దర్యాప్తులో తేలిన విషయాల ఆధారంగా ఎస్పీ అమన్ కుమార్ ఆ సిఫారసులు చేసినట్టు తెలిపారు.

ఎస్ఐ మనోజ్ కచ్ఛప్ ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ను వారితో పంచుకున్నట్టు దర్యాప్తులో తేలిందని ఎస్పీ అమన్ కుమార్ తెలిపారు. భద్రతా పరమైన కోణంలో ఇలాంటి అధికారులను వెంటనే తొలగించాల్సి ఉంటుందని వివరించారు.

మార్చి నెలలో ఎస్ఐ మనోజ్ కచ్ఛప్ డిస్మిస్‌ను డీఐజీ రాంచీ ఆమోదించారు.