షాకింగ్ రిపోర్టు.. కోవిడ్-19 రోగులలో 6.5% మంది ఆసుపత్రిలో చేరి కోలుకున్న ఏడాదిలోనే మృతి
Covid-19: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన డేటా ప్రకారం.. భారత్ లో కోవిడ్-19 కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 70 కేసుల నమోదుతో క్రియాశీల కేసులు 466కు చేరుకున్నాయి. మొత్తంగా 5,32,031 మంది మరణించగా, ఇప్పటివరకు 4,49,98,463 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. అయితే, కోవిడ్-19 బారినపడి ఆస్పత్రిలో చేరి కోలుకున్న వారిలో మరణాలు, అనారోగ్య సమస్యలు పెరిగాయంటూ షాకింగ్ విషయాలను ఎన్సీఆర్సీ నివేదిక వెల్లడించింది.

Coronavirus-NCRC Report: కరోనా మహమ్మారికి సంబంధించి అనేక మందులు, వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇంకా ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కోవిడ్-19 ముప్పుపై ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. చాలా దేశాల్లో కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కోవిడ్-19 బారినపడి, కోలుకున్న వారిలో మరణాలు గురించి ఒక రిపోర్టు షాకింగ్ విషయాలు వెల్లడించింది. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని కోలుకున్న వారిలో 6.5 శాతం మంది రోగులు కోవిడ్ సంబంధిత పరిస్థితులతో సంవత్సరంలోనే మరణించారని నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ (ఎన్సీఆర్సీ) అధ్యయనం కనుగొంది. చిన్నారుల్లో ఈ మరణాలు రేటు అధికంగా ఉంది. అలాగే, స్త్రీల కంటే ఎక్కువ మంది పురుషులు ఆయా పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు.
ఎన్సీఆర్సీ (National Clinical Registry for Covid-19), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ యూనిట్ ఒక సంవత్సరం కరోనా సోకి కోలుకున్న వారి మరణాలకు సంబంధించిన అంశాలను మూల్యాంకనం చేసింది. కోవిడ్-19 రోగులను డిశ్చార్జ్ అయిన ఒక సంవత్సరం వరకు టెలిఫోన్ ద్వారా ట్రాక్ చేసింది.సెప్టెంబర్ 2020 నుండి ఫిబ్రవరి 2023 వరకు డేటాను ఎన్సీఆర్సీ సంబంధిత డేటాను సేకరించడంతో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మరణానికి ప్రధాన కారణం కోవిడ్ అనంతర పరిస్థితులు (PCC), గడ్డకట్టే అసాధారణతలు, అలసట, కీళ్ల నొప్పులు, గుండె ఆగిపోవడం వంటివి ఉన్నాయి.
"మరణాలకు మొదటి కారణం కోవిడ్ అనంతర గుండె సమస్యలు. ఇతర ప్రధాన పోస్ట్-కోవిడ్ సమస్యలు ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్, ఊపిరితిత్తుల దెబ్బతినడం వల్ల శ్వాసకోశ వైఫల్యం కావచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్, థ్రోంబోఎంబోలిజం, అలాగే మ్యూకోర్మైకోసిస్ వంటి ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌లు. పూర్తి మూత్రపిండ, ఊపిరితిత్తుల వైఫల్యాల ఫలితంగా మరణానికి దారితీయవచ్చు" అని కిమ్స్ ఆస్పత్రి మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ శివ రాజు చెప్పినట్టు డీసీ నివేదించింది. ఎన్సీఆర్సీ ట్రాక్ చేసిన 14,419 మంది రోగులలో, డిశ్చార్జ్ అయిన ఒక సంవత్సరంలోనే 942 మంది మరణించారు. ఇందులో 325 మంది మహిళలు, 616 మంది పురుషులు ఉన్నారు.
అలాగే, 175 మంది (18.6 శాతం) 18-45 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నారు. డిశ్చార్జ్ తర్వాత మరణం సగటు వ్యవధి 28 రోజులుగా ఉంది. 40 ఏళ్లు పైబడిన మగవారిలో డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక సంవత్సరంలోపు మరణానికి ఎక్కువ అవకాశం ఉందని అధ్యయనం కనుగొంది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక సంవత్సరంలో చనిపోయే అవకాశం 1.7 రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది. కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌కు ముందు కనీసం ఒక డోస్ వ్యాక్సినేషన్ పోస్ట్ డిశ్చార్జ్ మరణాల నుండి 60 శాతం రక్షణను అందించిందని అధ్యయనం తెలిపింది.