సినిమాటిక్ ప్లాన్... సర్వే ఆఫ్ ఇండియా డిఫెన్స్ అధికారి హత్యకేసులో షాకింగ్ విషయాలు...
తాను ఇష్టపడ్డ మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని.. డబ్బులు తిరిగి ఇవ్వమంటున్నాడని బాస్ నే హతమార్చాడో అసిస్టెంట్. ఆ తరువాత పోలీసులను తప్పుదోవపట్టించేందుకు సినిమాటిక్ ప్లాన్ చేశాడు.

న్యూఢిల్లీ : తన బాస్ ను హత్య చేసి.. తనింటి ప్రాంగణంలోనే మృతదేహాన్ని దాచిపెట్టిన అనీస్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సర్వే ఆఫ్ ఇండియా డిఫెన్స్ అధికారి హత్య కేసును తప్పుదోవ పట్టించడానికి నిందితుడు అనీస్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. బాస్ దగ్గర తీసుకున్న రూ. 9 లక్షలు తిరిగిఇవ్వాల్సి రావడం... తాను మనసుపడ్డ అమ్మాయితో బాస్ క్లోజ్ గా ఉండడంతో కక్ష కట్టిన అనీస్ బాస్ మహేష్ కుమార్ ను అతి దారుణంగా హత్య చేశాడు.
ఖాళీగా ఉన్న ఫ్లాట్ కి పిలిచి అతని తలపై రెంచ్‌తో తొమ్మిది దెబ్బలు కొట్టి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఇంటి ప్రాంగణంలోనే గొయ్యి తీసి పూడ్చి పెట్టి, సిమెంట్ తో చదును చేశాడు. ఆ తరువాత కేసును తప్పుదోవ పట్టించడానికి అనీస్ కుమార్ చేసినవి అన్నీ ఇన్నీ కావు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు మొబైల్ ఫోన్లను కూడా వివిధ చోట్ల ఉంచాడు.
హత్యప్లాన్ కోసం సెలవు.. బాస్‌ని హతమార్చి, మృతదేహాన్ని ఇంటి ప్రాంగణంలో పూడ్చిపెట్టి...
ఢిల్లీ పోలీసులు ఈ హత్య కేసును ఛేదించి.. అనీస్ కుమార్ (24)ని అరెస్టు చేశారు. ఎలాంటి నేర చరిత్ర లేని ఓ వ్యక్తి పక్కా ప్లాన్ తో నేరాన్ని చేసి, ఎలా తప్పించుకోగలిగాడో బుధవారం వివరించారు.
అనీస్ సర్వే ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ మృతుడు 42 ఏళ్ల మహేష్ కుమార్ కూడా సీనియర్ సర్వేయర్‌గా ఉన్నారు.
గత సంవత్సరం, అనీస్ తనకు ప్రభుత్వంలో మంచి సంబంధాలు ఉన్నాయని.. తాను అనుకుంటే ఉద్యోగాలు ఇప్పించగలనని చెప్పుకున్నాడు. మహేష్‌కు పరిచయస్తులు కొందరు ఉద్యోగం కోసం చూస్తున్నారు..దీంతో, ఓ ముగ్గురికి ఉద్యోగాలు ఇప్పించాలని అనీస్‌ను కోరాడు మహేష్. దీనికి అంగీకరించిన అనీస్ ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇచ్చినప్పటికీ.. ఉద్యోగాలు రాలేదు. దీంతో మహేష్ దగ్గర తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించడానికి అనీస్ సమయం కోరాడు.
మరోవైపు బాస్ మహేష్ కుమార్, అనీస్ ఇదస్దరూ వారి ఆఫీస్ లో పనిచేసే ఓ మహిళా సహోద్యోగితో ప్రేమలో ఉన్నారు. గత నెలలో, డబ్బు తిరిగి చెల్లించాలంటూ అనీస్‌ను మహేష్ వేధించడం ప్రారంభించాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో అనీస్ డబ్బుతో పాటు ఆ మహిళను కూడా తన వద్ద ఉంచుకునేందుకు మహేష్‌ను హత్య చేసేందుకు పథకం పన్నాడు.
నేరానికి సన్నాహకంగా, అనీస్ ఆఫీసు నుండి ఐదు రోజుల సెలవు తీసుకున్నాడు. ఆ రోజు దక్షిణ ఢిల్లీలోని వివిధ మార్కెట్లలో ప్లాస్టిక్ షీటింగ్, రెంచ్‌లు, పారను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత హర్యానాలోని సోనిపట్‌లోని తన స్వగ్రామానికి వెళ్లి అక్కడ తన ఉనికిని చాటుకునేందుకు తన ఫోన్‌ను వదిలేశాడు.
డబ్బు ఇస్తానని చెప్పి ఆగస్టు 28న మహేష్‌ను ఆర్‌కే పురం సెక్టార్ 2లోని అపార్ట్‌మెంట్‌కు ఆహ్వానించాడు. అక్కడికి వచ్చిన మహేష్‌ను రెంచ్‌తో కొట్టి హతమార్చాడు. హత్య అనంతరం అనీస్ రూ.65 లక్షల అప్పు కట్టలేక అండర్‌గ్రౌండ్‌కు వెళ్తున్నట్లు మహేశ్ ఫోన్‌లో వాట్సాప్ స్టేటస్ అప్‌లోడ్ చేశాడు. ఆ తర్వాత అనీస్ తన అపార్ట్‌మెంట్‌లో ఏసీని ఆన్ లోనే ఉంచి మహేష్ ఫోన్ తీసుకుని ఫరీదాబాద్‌కు వెళ్లాడు. పరిశోధకులను తప్పుదారి పట్టించేందుకు మహేష్ ఫోన్ ను ఫరీదాబాద్ లో పడేసి సోనిపట్‌కు తిరిగి వచ్చాడు.
మరోవైపు మహేష్ కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. మహేష్ మృతదేహాన్ని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ అనీస్ ఢిల్లీకి తిరిగొచ్చాడు. తరువాత ఆర్‌కె పురం సెక్టార్ 6లోని మురుగు కాలువకు సమీపంలో ఉన్న సహోద్యోగి ఇంటి తాళపుచెవిని తీసుకున్నాడు.
మామూలుగా ఆ ఇల్లు ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. స్నేహితుడి దగ్గర కీని తీసుకుని దాన్ని డూప్లికేట్ చేసి అసలు తాళం చెవి తిరిగి ఇచ్చాడు. ఆ తరువాత ఆ ఇంటి ప్రాంగణంలోని రెండు అడుగుల లోతైన గుంటలో మహేష్ మృతదేహాన్ని పాతిపెట్టాడు. దానిమీద ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడానికి ప్లంబర్‌ని పిలిచాడు. ప్లంబర్ దానిమీద ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించేవరకు అనీస్ దాదాపు 12 గంటలపాటు అక్కడే నిలబడి ఉన్నాడు. ప్లంబర్ ఇప్పుడు పోలీసులకు సాక్షిగా ఉన్నాడు.
మహేష్ కోసం గాలిస్తున్న పోలీసులకు అతని మొబైల్ లొకేషన్ ఫరీదాబాద్‌లో ఉన్నాడని సూచించడంతో అక్కడ పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. కాగా, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వివరాల రికార్డుల విశ్లేషణలో మహేష్ చివరిసారిగా అనీస్ తో వాట్సాప్‌లో మాట్లాడినట్లు పరిశోధకులు కనుగొన్నారు.
దీంతో అనుమానంతో అనీస్ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు మహేష్ కారు తాళం కనిపించింది. "మహేష్ తన దగ్గరికి వచ్చాడని అనీస్ మాకు చెప్పాడు, కానీ అతని కారు కీని అక్కడే వదిలి ఇంటికి తిరిగి వెళ్లాడని చెప్పాడు. అనిష్.. మహేష్ కుటుంబాన్ని కలిసి.. మహేష్ ను వెతకడంలో పూర్తి సహకారం అందిస్తానని వారికి హామీ ఇచ్చాడు" అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
సాంకేతిక ఆధారాలు, సందర్భోచిత సాక్ష్యాల మద్దతుతో నిరంతర విచారణ తరువాత అనీస్ తన నేరాన్ని అంగీకరించాడు. అతను మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశానికి పోలీసులను తీసుకెళ్లాడు. దీంతో అనీస్ మీద హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, అపహరణ కింద కేసు నమోదు చేశారు. బాధితుడి మృతదేహాన్ని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ నుంచి వెలికితీశామని, రూ. 5 లక్షల నగదు, రెండు వాహనాలు, హత్యాయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని ఓ అధికారి తెలిపారు.