మహారాష్ట్రలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివసేనకు బీజేపీ షాకిచ్చింది. రాజ్యసభలో ఆ పార్టీ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ సంజయ్ రౌత్ సీటును మార్చేశారు. సభలో మూడో వరుసలోని సీటులో ఇప్పటి వరకు సంజయ్ కూర్చునేవారు...ఇప్పుడు ఆయన సీటును ఐదో వరుసలోని కూర్చీకి మార్చారు.

బీజేపీ తీరుపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నపళంగా తన సీటును మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడికి ఆయన లేఖ రాశారు.

Also read:'మహా' మలుపు: మోడీతో శరద్ పవార్ భేటీ, శివసేన మాట ఇదీ

తన సీటును వెనుకకు మార్చడం తీవ్ర ఆశ్చర్యం కలిగించిందని, శివసేన నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి, తమ పార్టీ గొంతును నొక్కేయడానికే ఉద్దేశ్యపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందని రౌత్ ఎద్దేవా చేశారు.

తనను, శివసేనను అవమానించడానికే ఇలా సీటు వరుసను మార్చారని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి నుంచి తప్పుకున్నట్లు తాము ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని, అయినప్పటికీ సీటును ఎందుకు మార్చారని రౌత్ బీజేపీని ప్రశ్నించారు. 

మరోవైపు శివసేనకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను కలవాలని అసంతృప్త ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.

Also read:మహా రాజకీయం: శివసేనకు ఎమ్మెల్యేల తిరుగుబాటు ముప్పు

ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయమై ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకుండా పోయింది. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని  భావిస్తున్నారు ఈ మేరకు ఈ మూడు పార్టీల మధ్య చర్చలు జరిగాయి.

ఈ తరుణంలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తును శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతోనే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శివసేనకు చెందిన 17 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.బీజేపీతో  కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే రెంటికి చెడ్డ రేవడిగా పరిస్థితి మారే అవకాశం ఉందని అసంతృప్త ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు.

ఇదే విషయాన్ని పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు చెప్పాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు 17 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రేను కలుసుకోవాలని  భావిస్తున్నారు. ఆయన అపాయింట్ మెంట్ కోరారు.