న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుడు, బిజెపి అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై బూటు విసిరిన సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బిజెపి కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతుండగా జీవీఎల్ పై ఓ వ్యక్తి బూటు విసిరాడు. అతన్ని శక్తి భార్గవగా గుర్తించారు. వృత్తిరీత్యా అతను సర్జన్.

బూటు విసిరిన తర్వాత అతని విజిటింగ్ కార్డును చూసి అతన్ని బయటకు పంపించేశారు. అతను కాన్పూర్ కు చెందినవాడు. కాన్పూర్ లోని భార్గవ ఆస్పత్రిలో అతను డాక్టరుగా పనిచేస్తున్నాడు. అయితే, అతను అలా ఎందుకు చేశాడనేది ప్రశ్నార్థకంగా మారింది. 

ఫేస్ బుక్ లో తనను తాను అతను విజిల్ బ్లోయర్ గా చెబుకున్నాడు. ఏప్రిల్ 16వ తేదీన తన ఫేస్ బుక్ పేజీలో ఓ నోట్ రాశాడు. గత మూడేళ్లలో ఈ పీఎస్ యూలో 14 మంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని రాశాడు. అదే రోజు మరో నోట్ కూడా రాశాడు. హౌ ద విజిల్ బ్లోయర్స్ వర్ ట్రీటెడ్ ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్ అనే శీర్షిక పెట్టాడు. 

ఆ వరుసలో అతను నాలుగు పోస్టులు పెట్టాడు. తన పోస్టుల్లో అతను ప్రధాని నరేంద్ర మోడీపై, అవినీతికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశాడు.

జీవిఎల్ పై దాడి చేసిన వెంటనే భార్గవను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతను ఎందుకు దాడి చేశాడనే విషయం వెంటనే తెలియలేదు. అతన్ని బయటకు పంపించిన తర్వాత జీవిఎల్ మాట్లాడుతూ తనపై జరిగిన దాడికి కాంగ్రెసును నిందించారు. 

మరో వాదన కూడా ఉంది... శక్తి భార్గవ ఖాతాల నుంచి బంగళాల కొనుగోలు కోసం రూ.11.50 కోట్ల క్రయవిక్రయాలు జరిగాయని, తన భార్యాపిల్లల పేర్లతో ఆ బంగళాలను కొనుగోలు చేశాడని, బినామీ ప్రాపర్టీ రూల్స్ అతిక్రమించి కొన్నారనే కోణంలో ఆయన విచారణ ఎదుర్కుంటున్నారని సమాచారం.

భార్గవ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయని, అతని ఇంట్లో 28లక్షల డబ్బు, 50 లక్షల విలువ చేసే ఆభరణాలు లభ్యమైనట్లు తెలిసిందని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. శక్తి భార్గవ విచారణలో ఆసక్తికర విషయాలు చెప్పాడు. తనపై కక్షకట్టి ఐటీ దాడులు చేశారని, తన ఆస్పత్రుల్లో సోదాలు చేశారని తెలిపాడు. 2018 నుంచి తాను ఆర్థికంగా చాలా నష్టపోయానని, తాను మోడీ ప్రభుత్వ బాధితుడినని శక్తి భార్గవ చెప్పాడు.

సంబంధిత వార్త

డిల్లీలో జీవిఎల్‌‌కు అవమానం...మీడియా ముందే చెప్పుతో దాడి (వీడియో)