ఆంధ్ర ప్రదేశ్ బిజెపి నేత, రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు కు ఛేదు అనుభవం ఎదురయ్యింది. ఆయనపై దేశ రాజధాని డిల్లీలో ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. మీడియా ఎదుటే హటాత్తుగా జరిగిన ఈ దాడితో జీవిఎల్ షాక్ కు గురయ్యారు. 

లోక్ సభ  ఎన్నికల సందర్భంగా జీవిఎల్ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం రాజధాని డిల్లీలో వున్న అతడు ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడేందుకు బిజెపి జాతీయ కార్యాలయంలో జాతీయ మీడియాతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో జీవిఎల్ మాట్లాడుతుండగా మీడియా సభ్యుల మధ్య కూర్చున్న ఓ వ్యక్తి హటాత్తుగా పైకి లేచి వేదికపై వున్న ఆయనపై చెప్పు విసిరాడు. 

అయితే చెప్పు మాత్రం జీవిఎల్ పై కాకుండా కొద్ది దూరంలో పడిపోయింది. దీంతో అప్రమత్తమైన ఎంపీ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు జీవిఎల్ పై ఎందుకు చెప్పు విసిరాడో తెలియాల్సి వుంది. అయితే దాడికి పాల్పడిన వ్యక్తి పేరు శక్తి భార్గవ్ అని..అతడు వైద్య వృత్తిలో వున్నట్లు తెలుస్తోంది. 

బిజెపి నాయకులు మాత్రం ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్రేనని ఆరోపిస్తున్నారు. ఎదురుగా తమను ఎన్నికల్లో ఎదుర్కోలేకే దొంగచాటుగా ఇలా దాడులకు పాల్పడుతూ అవమానించాలని చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దాడిపై జీవిఎల్ మాత్రం ఇంకా స్పందించలేదు.