టిక్కెట్ ఇవ్వలేదని కోపం లేదు.. ప్రధాని మోడీతో వీడియో కాల్ లో కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించకపోవడం పట్ల తనకు ఎలాంటి కోపం లేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప అన్నారు. గురువారం ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాల్ చేశారు. ఈ సందర్భంగా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల పర్వం నిన్నటితో పూర్తయ్యింది. దీంతో నేడు నామినేషన్ల పరిశీలన జరగుతోంది. ఈ సారి బీజేపీ కొత్త ముఖాలను బరిలోకి దించింది. దీంతో పలువురు సీనియర్లకు టిక్కెట్లు కేటాయించలేదు. ఇందులో బీజేపీ సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప కూడా ఉన్నారు. అయితే ఆయన కుమారుడికి కాషాయ పార్టీ టిక్కెట్ ఇస్తుందని ఆయన భావించినా.. అలా కూడా జరగలేదు. కాగా.. ఇలా టిక్కెట్లు రాక నిరాశ చెందిన పలువురు సీనియర్లు బీజేపీ వీడారు. ఈశ్వరప్ప కూడా పార్టీని వీడుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన బీజేపీ వెంటే ఉన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ఈశ్వరప్ప సమర్థించారు.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఈశ్వరప్పకు వీడియో కాల్ చేశారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో విడుదల చేశారు. కర్ణాటకలో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని ఈశ్వరప్ప ప్రధాని మోడీకి హామీ ఇచ్చారు. టికెట్ నిరాకరించడంపై ఈశ్వరప్ప గురువారం స్పందిస్తూ.. ‘బీజేపీపై నాకు కోపం లేదు. పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలి. మన పార్టీపై కోపంతో కాంగ్రెస్ లో చేరిన వారిని తిరిగి బీజేపీలోకి తీసుకురావాలి.’’ అని ఆయన అన్నారు. బీజేపీ గెలిచి సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కాగా.. శివమొగ్గ స్థానంలో చెన్నబసప్పకు బీజేపీ టికెట్ కేటాయించింది. దీంతో ఆయన కేఎస్ ఈశ్వరప్ప సమక్షంలో చెన్నబసప్ప నామినేషన్ దాఖలు చేశారు. అలాగే రాజకీయాల నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించారు.
యువకుడిపై అత్యాచారం.. బస్సులో నుంచి దించి మరీ దారుణం.. వీడియో తీసి డబ్బులు వసూలు..
బీజేపీ జాగ్రత్తగా అభ్యర్థుల జాబితాను రూపొందించింది. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీజేపీ టికెట్లు నిరాకరించి.. డాక్టర్లు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, న్యాయవాదులు, విద్యావేత్తలు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలను బరిలోకి దింపింది. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది.
3,632 మంది అభ్యర్థుల నామినేషన్లు..
కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 3,632 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తిరస్కరణకు గురికాకుండా ఉండేందుకు పలువురు అభ్యర్థులు ఎక్కువగా నామినేషన్లు వేయడంతో ఏప్రిల్ 20 నాటికి మొత్తం 5,102కు చేరుకున్నాయి. ఈ పత్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు పరిశీలించనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 చివరి తేదీగా ఉంది. రాష్ట్రంలో ఒకే విడత ఎన్నికల పోలింగ్ మే 10న జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.