న్యూఢిల్లీ: సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న చోట్ల కొద్ది రోజుల వ్యవధిలోనే రెండు కాల్పుల సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారిపై వేటు పడింది. ఢిల్లీ సౌత్ ఈస్ట్ డిప్యూటీ పోలీసు కమిషనర్ (డీసీపీ) చిన్మయ్ బిస్వాల్ నుంచి ఆ పదవి నుంచి తప్పించారు.

ఆ రెండు సంఘటనలను ఉటంకిస్తూ ఆయన స్థానంలో తాత్కాలిక డీసీపీగా బాధ్యతలు చేపట్టాలని ఎన్నికల సంఘం కుమార్ జ్ఞానేష్ ను ఆదేశించింది. కాల్పులు జరిగిన షాహిన్ బాగ్ లో పరిస్థితిపై ఎన్నికల సంఘం ఆదివారం సమీక్ష జరిపింది. రెగ్యులర్ డీసీపీగా నియమించడానికి అర్హులైన ముగ్గురి పేర్లతో ఓ జాబితాను హోం మంత్రి మంత్రిత్వ శాఖ లేదా ఢిల్లీ పోలీసు కమీషనర్ తమకు పంపించాలని ఆదేశించింది.

Also Read: సీఏఏని వ్యతిరేకిస్తూ నిరసనలు... స్కూటీపై వచ్చి కాల్పులు

వెంటనే 2008 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన చిన్మయ్ బిస్వాల్ ను ఆ పదవి నుంచి తప్పించి వెంటనే ఆయన నుంచి బాధ్యతలు స్వీకరించాలని ఎస్ హెచ్ కుమార్ జ్ఞానేష్ ను ఆదేశించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 

ఆ ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఢిల్లీ ఎన్నికల అధికారులు, పోలీసు పరిశీలకులు తమకు నివేదికలు అందించారని, బిస్వాల్ తీసుకున్న చర్యల వల్ల స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయని తాము విశ్వసించడం లేదని కూడా తెలిపింది.

సిఏఏకు నిరసనగా ఆందోళన చేస్తున్నవారిపై జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ఓ టీనేజర్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జీవార్ కు చెందిన ఆ టీనేజర్ 12వ తరగతి చదువుతున్నాడు. 

Also Read: షాహిన్ బాగ్ లో కాల్పులు: నిందితుడు కపిల్ గుజ్జార్ పట్టివేత

అదే విధమైన సంఘటన శనివారంనాడు షాహిబాగ్ ప్రాంతంలో జరిగింది. 25 ఏళ్ల కపిల్ గుజ్జార్ అనే యువకుడు జై శ్రీరామ్ అని నినదిస్తూ కాల్పులు జరిపాడు. ఈ దేశంలో హిందువుల మాట చెల్లుబాటు అవుతుందని, మరొకరది కాదని అతని అరిచినట్లు కూడా చెబుతున్నారు. ఈ సంఘటనలు ఫిబ్రవరి 8వ తేదీన జరిగే ఢిల్లీ శాసనసభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.