దేశరాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనల్లో కాల్పుల కలకలం సృష్టించారు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులు సీఏఏని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు.  కాగా... ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడకు వచ్చి తుపాకీలతో కాల్పులు జరిపారు.

ఆ ఇద్దరిలో ఒకరు రెడ్ కలర్ జాకెట్ వేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. స్కూటీపై వచ్చి  మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కాగా... ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం.

Also Read భార్యను నరికి, తల చేతిలో పట్టుకుని 1.5 కి.మీ. ఇలా నడిచి.......

అయితే.. కేవలం ఐదు రోజుల్లో ఇలాంటి ఘటనలు మూడు చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఆ కాల్పులు జరిపిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన అనంతరం జామియా మిల్లియా యూనివర్శిటీ విద్యార్థులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి భారీగా ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన ఇంకా కొనసాగుతోంది. జామియా నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జామియా మిల్లియా యూనివర్శిటీ విద్యార్థులు ఆరంభం నుంచీ నిరవధికంగా నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.