న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని షాహిన్ బాగ్ లో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. పౌరసత్వ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న స్థలంలో అతను గాలిలోకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. జసోలా రోడ్ లైట్ సమీపంలోని నిరసన శిబిరం వద్ద గల బారికేడ్ సమీపంలో అతను కాల్పులు జరిపాడు.

 

Also Read: జామియా షూటర్: స్కూల్ కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి..

కాల్పులు జరిపిన వ్యక్తిని కపిల్ గుజ్జార్ గా గుర్తించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఏఏకు మద్దతుగా అతను ఆ పనికి ఒడిగట్టాడు. గాలిలోకి కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారని డీసీపీ చిన్మయ్ బిస్వాల్ చెప్పారు. సంఘటనా స్థలంలో ఖాలీ బుల్లెట్ షెల్స్ కనిపించాయి. కాల్పులు జరిగిన వ్యక్తి కపిల్ గుజ్జారు నోయిడా సరిహద్దుల్లోని దల్లాపురాకు చెందినవాడని తెలుస్తోంది. 

Also Read: జామియా షూటింగ్: గన్ ఎక్కడిదంటే, విస్తుపోయే విషయాలు వెల్లడి

జామియా కాల్పులు జరిగిన 48 గంటల లోపలే ఈ సంఘటన చోటు చేసుకుంది. జనవరి 30వ తేదీన జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో టీనేజ్ విద్యార్థి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.జామియా, షాహిన్ బాగ్ ప్రాంతాల్లో గత 50 రోజులుగా సీఏఏకు, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.