దేశ భద్రత కోసం స్పైవేర్ ఉండటం తప్పు కాదు, కానీ దాన్ని ఎవరిపై వాడుతున్నారన్నది ముఖ్యమని సుప్రీంకోర్టు పెగాసస్ కేసులో పేర్కొంది. పెగాసస్ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
బుధవారం సుప్రీంకోర్టులో పెగాసస్ స్పైవేర్ కేసుపై విచారణ జరిగింది. దేశ భద్రత కోసం స్పైవేర్ ఉండటం తప్పు కాదని, కానీ దాన్ని ఎలా, ఎవరిపై వాడుతున్నారన్నదే ముఖ్యమని కోర్టు పేర్కొంది.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్‌తో జర్నలిస్టులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరపాలని 2021లో పిటిషన్లు దాఖలయ్యాయి. దేశ భద్రత విషయంలో రాజీపడలేమని ధర్మాసనం పేర్కొంది.
దేశ భద్రతతో రాజీపడలేం
విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది దినేష్ ద్వివేదికి జస్టిస్ సూర్యకాంత్, "దేశం స్పైవేర్ వాడితే తప్పేముంది? స్పైవేర్ ఉండటం తప్పు కాదు. దాన్ని ఎవరిపై వాడుతున్నారన్నదే ప్రశ్న. దేశ భద్రతతో రాజీపడలేం" అని అన్నారు.
కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, "ఉగ్రవాదులు వ్యక్తిగత గోప్యత హక్కు కోరలేరు" అని వాదించారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, "గోప్యతా హక్కున్న పౌరుడికి రాజ్యాంగం ప్రకారం రక్షణ ఉంటుంది" అని అన్నారు.
అమెరికా కోర్టు తీర్పును ఉదహరించిన సిబ్బల్
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బల్ అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పును ఉదహరించారు. వాట్సాప్‌ను హ్యాక్ చేయడానికి ఎన్ఎస్ఓ గ్రూప్ పెగాసస్ మాల్వేర్‌ను వాడిందని, ఇందులో భారత్ కూడా ప్రభావిత దేశాల్లో ఒకటని ఆ తీర్పులో పేర్కొన్నారని అన్నారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, సుప్రీంకోర్టు ఇప్పటికే వివరణాత్మక తీర్పు ఇచ్చిందని, ఆరోపణలపై విచారణకు జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో కమిటీని వేసిందని గుర్తుచేశారు.
