మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను అవమానించేలా ఉన్నాయని సంజయ్ రౌత్ అన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ముంబయి: శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీపై ఫైర్ అయ్యారు. భగత్ సింగ్ కొశ్యారీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రకు, ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు అవమానకరం అని ఆగ్రహించారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆయనను గవర్నర్ పదవి నుంచి తొలగించాలని అన్నారు. అంతేకాదు, గవర్నర్ స్వయంగా రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.
‘భగత్ సింగ్ కొశ్యారీ వ్యాఖ్యలు మహారాష్ట్ర, శివాజీ మహారాజ్‌కు అవమానకరం. సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు చేస్తున్నది. వారు షూలతో కూడా దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ షూస్ రాజ్‌భవన్‌కుు వెళ్లాలి. ఎందుకంటే, శివాజీ మహారాజ్‌కు వ్యతిరేకంగా కామెంట్లు అక్కడి నుంచే వచ్చాయి. అలా చేస్తేనే మీరు అసలైన నిజమైన మహారాష్ట్ర పుత్రులు. లేదంటే మీరు ఫేక్’ అని సంజయ్ రౌత్ ఆగ్రహించారు.
Also Read: రాహుల్ గాంధీ, ఆదిత్యా ఠాక్రేలు దేశానికి నాయకత్వం వహించేంత సమర్థులు: సంజయ్ రౌత్
ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మరఠ్వాడా యూనివర్సిటీలో శనివారం నిర్వహించని ఓ కార్యక్రమంలో గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని లేపాయి. ఆ సమావేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను ఓల్డ్ ఐడల్ అని అన్నారు.
Also Read: త్వరలోనే మోదీ, అమిత్ షాలను కలుస్తానని చెప్పిన సంజయ్ రౌత్.. ఫడ్నవీస్‌పై ప్రశంసలు..
‘మీరు ఎవరిని కొలుస్తావని, ఎవరిని ప్రేరణగా తీసుకుంటాని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మీరు వెతకడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడే మహారాష్ట్రలోనే ఆ సమాధానం తెలుసుకోవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత ఐడల్. ఇప్పుడు కొత్త వారిని బాబా సాహెబ్ అంబేద్కర్ నుంచి నేటి (కేంద్రమంత్రి) నితిన్ గడ్కరీ వరకూ చూడొచ్చు’ అని భగత్ సింగ్ కొశ్యారీ అన్నారు.
భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో సాగిన సమయంలో రాహుల్ గాంధీ సావర్కర్ పై విమర్శలు సంధించారు. సావర్కర్ బ్రిటీష్ పాలకులకు సహాయం చేశాడని, భయంతో క్షమాభిక్ష పిటిషన్ రాశారని రాహుల్ గాంధీ తెలిపారు. సావర్కర్ రాసిన లేఖ నకలును చూపిస్తూ.. సావర్కర్ ఇందులో ఇలా రాశారని ఉల్లేఖనలు చేశారు. అత్యంత విశ్వాస పాత్రుడైన సర్వెంట్‌గా ఉంటానని వేడుకుంటున్నా అని రాసినట్టు ఆయన వివరించారు. ఈ లేఖపై ఆయన సంతకం పెట్టాడంటే కారణం ఏమిటని ప్రశ్నించారు. ఇది కేవలం భయం మాత్రమే అని తెలిపారు. ఆయన బ్రిటీషర్లకు భయపడ్డాడు అని ఫైర్ అయ్యారు.
