రాహుల్ గాంధీ, ఆదిత్యా ఠాక్రేలు దేశానికి నాయకత్వం వహించేంత సమర్థులు అని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. వారిద్దరూ కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్ర, దేశాభివృద్ధి చేయడంలో వీరికి అనూహ్యమైన బలం ఉన్నదని తెలిపారు.
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, శివసేన నేత ఆదిత్యా ఠాక్రేలు ఇద్దరూ దేశానికే సారథ్యం వహించే సమర్థవంతమైన నేతలు అని వివరించారు. వారిద్దరూ నిన్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లిన సంజయ్ రౌత్ ఇటీవలే బెయిల్ పై విడుదలై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చీ రాగానే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది.
ఇద్దరు ప్రముఖ నేతలు రాహుల్ గాంధీ, ఆదిత్యా ఠాక్రేలు కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారని వివరించారు. ఇది సరికొత్త ఉత్సాహానికి, శక్తికి పుట్టుక ఇస్తున్నదని చెప్పారు. ఈ ఇద్దరు యువ నేతలు దేశాన్నే లీడ్ చేసే కెపాసిటీ ఉన్నవారు అని తెలిపారు. తమ రాష్ట్రం గురించి, దేశ అభివృద్ధి గురించి పని చేయడానికి వారిద్దరి వద్ద అనూహ్యమైన బలం ఉన్నదని చెప్పారు.
ఉద్ధవ్ ఠాక్రే, వంచిత్ బహుజన్ అఘాదీ లీడర్ ప్రకాశ్ అంబేద్కర్ దగ్గర కావడం పై ఆయనను విలేకరులు ప్రశ్నించారు. ఈ బంధం తాతల కాలం నుంచే ఉన్నదని సంజయ్ రౌత్ వెల్లడించారు. బాబా సాహెబ్ అంబేద్కర్, ప్రబోధనకర్ ఠాక్రే సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. మరాఠీ ప్రజల గౌరవం గురించి అంబేద్కర్‌కు గొప్ప ఆలోచనలు ఉన్నాయని వివరించారు.
Also Read: త్వరలోనే మోదీ, అమిత్ షాలను కలుస్తానని చెప్పిన సంజయ్ రౌత్.. ఫడ్నవీస్‌పై ప్రశంసలు..
అంబేద్కర్, ఠాక్రేలు అనే రెండు శక్తులు ఒకదగ్గరకు చేరుతున్నాయని, దేశంలో రాజకీయాలు మారుతున్నాయని అర్థం చేసుకోవాలని విరవించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు ఉద్ధవ్ ఠాక్రేను తిరుగులేని శక్తిగా మలుస్తున్నాయని చెప్పారు.
ప్రతి ఒక్కరూ ఉద్ధవ్ ఠాక్రేను విశ్వసిస్తారని అన్నారు. మిగతా వారు గాలిబుడగల్లా మారిపోతున్నారని, తాను శివసేన హవాను చూస్తున్నా అని వివరించారు. మహారాష్ట్ర రాజకీయాలను ఈ హవా ప్రభావితం చేస్తుందని చెప్పారు. సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని టార్గెట్ చేసుకుని ఈ కామెంట్లు చేశాడు.
