చెన్నై: వ్యభిచారగృహాన్నినిర్వహిస్తూ ప్రముఖ తమిళ నటి సంగీత బాలన్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. చెన్నైలోని పనయూర్‌ ప్రాంతంలోగల ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో సంగీత బాలన్ వ్యభిచార గృహాన్నినిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో వారు రిసార్ట్‌పై దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది విటులతో సహా పలువురు మహిళలను పోలీసులు అదపులోకి తీసుకున్నారు. 

మహిళలంతా ఉత్తర భారతదేశానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. వారిని వ్యభిచారం గృహం నుంచి పునరావాస కేంద్రానికి తరలించారు. వ్యభిచారగృహ నిర్వహణలో సంగీతకు సహకరిస్తున్న సురేష్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మరింత మంది యాక్టర్ల పాత్ర ఉండి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

వీరిద్దరిని మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టారు. వారికి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సంగీత బాలన్ 1996లో వచ్చిన కరప్పురోజాతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా నటించింది.  తమిళంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ సీరియల్ రాణీ - వాణీలో ప్రముఖ నటి రాధికతో కలిసి నటిస్తోంది.