భారత్-చైనా సరిహద్దుల్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నయనీ, ఇరు దేశాల మధ్య సంబంధాలు వరుస తప్పి విపరీతంగా ఉన్నట్లు విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ తెలిపారు. సరిహద్దు నిర్వహణ ఒప్పందాలను చైనా ఉల్లంఘించడమే ప్రధాన కారణమన్నారు.
భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు నిలకడగా ఉన్నాయని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనపై విదేశాంగ మంత్రి S. జైశంకర్ (S Jaishankar) శనివారం ఘాటుగా స్పందించారు. భారతదేశం ప్రత్యేకతను కోరుకోకుండా అన్ని దేశాలతో సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటుందని , అయితే.. చైనా సరిహద్దు నిర్వహణ ఒప్పందాలను ఉల్లంఘించిన ఫలితంగా "అసాధారణ" సంబంధాన్ని కొనసాగిస్తుందని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు వరుస తప్పి విపరీతంగా ఉన్నట్లు తెలిపారు. సరిహద్దు నిర్వహణ ఒప్పందాలను చైనా తరుచు ఉల్లంఘిస్తుందని అన్నారు.
డొమినికన్ రిపబ్లిక్ అధికారిక పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి S. జైశంకర్ డిప్లొమాటిక్ స్కూల్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో కనెక్టివిటీ, పరిచయాలు, సహకారంలో సంబంధాలన్నీ విస్తరించాయని అన్నారు. 'అది అమెరికా అయినా, యూరప్ అయినా, రష్యా అయినా లేదా జపాన్ అయినా.. తాము ప్రత్యేకతను కోరుకోకుండా.. అన్నీ దేశాలతో సత్సంబంధాలన్నీ కొనసాగించాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు. అయితే, సరిహద్దు వివాదంతో చైనాతో సంబంధాలు అసాధారణ స్థాయికి చేరుకున్నాయని అన్నారు. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి చైనా పెద్ద సంఖ్యలో సైనికులను మోహరించడం, దాని దూకుడు వైఖరిని భారతదేశం విమర్శిస్తోంది.
షాంఘై సహకార సంఘం (SCO) సమావేశాల సందర్భంగా చైనా రక్షణ మంత్రి లీ షాంగ్ఫు ఇటీవల భారత దేశంలో రెండు రోజులపాటు పర్యటించిన సంగతి తెలిసిందే. ఆయన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh)తో భేటీ అయ్యారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కూడా సరిహద్దు సమస్య పరిష్కారమైతేనే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని తెలిపారు..
