న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లులపై ఓటింగ్ సమయంలో ఆదివారం నాడు రాజ్యసభలో గందరగోళ వాతావరణం చోటు చేసుకొంది. వ్యవసాయ బిల్లుల ప్రతులను విపక్షాలు చించేశారు. దీంతో ఈ సమయంలో సభలో ఎవరు ఏం చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

రెండు వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వైసీపీ మాత్రం ఈ బిల్లులకు మద్దతుగా నిలిచింది. టీఆర్ఎస్ వ్యతిరేకించింది.

ఈ బిల్లులపై చర్చ సమయంలో విపక్ష సభ్యులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ బిల్లులతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని విపక్ష సభ్యులు అభిప్రాయపడ్డారు.

also read:రాజ్యసభలో రెండు వ్యవసాయ బిల్లులు: మద్దతిచ్చిన వైసీపీ, నో చెప్పిన టీఆర్ఎస్

ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలని విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈ బిల్లులపై సోమవారం నాడు కూడ చర్చను కొనసాగించాలని విపక్షాలు కోరాయి. ఇదే విషయాన్ని రాజ్యసభలో విపక్షనాయకుడు గులాంనబీ ఆజాద్ డిప్యూటీ ఛైర్మెన్ దృష్టికి తీసుకొచ్చారు. 

విపక్ష సభ్యులు రాజ్యసభ ఛైర్మెన్ పోడియం వద్దకు వెళ్లి నిరసనకు దిగారు. అకాలీదళ్, ఆప్ పార్టీలకు చెందిన ఎంపీలు వ్యవసాయ బిల్లు పేపర్లను చింపేశారు.రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ మైక్ ను లాగేందుకు విపక్ష సభ్యులు ప్రయత్నించారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొంది.