న్యూఢిల్లీ: రాజ్యసభలో రెండు వ్యవసాయ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లులకు వైసీపీ మద్దతును ప్రకటించింది. టీఆర్ఎస్ మాత్రం ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించింది.

రాజ్యసభలో రెండు వ్యసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై విపక్షాలు మండిపడుతున్నాయి.ఈ బిల్లులు రైతులకు నష్టం చేసేవిగా ఉన్నాయని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. రైతులు సత్యాగ్రహాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నాడీఎంకే అభిప్రాయపడింది. ఈ బిల్లులు పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీలకు ఉపయోగపడుతాయని ఆ పార్టీ తెలిపింది. 

బంగారు గుడ్లు పెట్టే బాతును కేంద్రం చంపేస్తోందని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఆరోపించారు. సంక్షోభాన్ని తట్టుకొని వ్యవసాయ రంగం నిలబడిందని కేకే ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

వ్యవసాయ బిల్లులు లోపభూయిష్టంగా ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈస్టిండియా కంపెనీ కింద ఉన్న పరిస్థితిని తీసుకురావొద్దని ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా అభిప్రాయపడ్డారు. ఈ బిల్లులద్వారా రైతులు రెట్టింపు ఆదాయాన్ని ఎలా పొందుతారని ఆయన ప్రశ్నించారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఈ బిల్లుపై ప్రసంగించే సమయంలో చేసిన వ్యాఖ్యల సందర్భంగా కొంత రగడ చోటు చేసుకొంది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చి దాన్ని అమలు చేయకపోవడం కపటమని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహారించుకోవాలని డిమాండ్ చేశారు.అంతేకాదు ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కూడ కోరారు.

ఈ బిల్లులతో రైతులు బానిసలుగా మారే ప్రమాదం ఉందని డీఎంకే అభిప్రాయపడింది. దేశ జీడీపీలో 20 శాతం వాటా ఉన్న రైతులు... ఈ చట్టం అమల్లోకి వస్తే బానిసలుగా మారే ప్రమాదం ఉందని డీఎంకే ఎంపీ టీకెఎస్ ఇలన్ గోవన్ అభిప్రాయపడ్డారు.

ఈ బిల్లులపై బీజేపీ చర్చ జరగాలని కోరుకోవడం లేదని సమాజ్ వాదీ పార్టీ అభిప్రాయపడింది. ఆ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.