రైల్వేస్టేషన్లు, రైళ్లలో మహిళలకు రక్షణగా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కొత్త సంస్కరణలు చేపడుతోంది రైల్వేశాఖ. మహిళా ఆర్పీఎఫ్ సిబ్బందిని నియమించి బోగీల్లో రాత్రిపూట గస్తీకి ప్రణాళికలు రూపొందిస్తోంది. రైల్వేశాఖ ఆ విధంగా ఆలోచిస్తుంటే ఒక ఆర్పీఎఫ్ సిబ్బంది కామంతో కళ్లు మూసుకుపోయి.. పట్టపగలు రైల్వేస్టేషన్‌లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు.

వివరాల్లోకి వెళితే మహారాష్ట్రాలోని థానే జిల్లాలోని కళ్యాణ్ రైల్వేస్టేషన్‌లో ఇద్దరు మహిళలు ఆరవ నంబర్ ఫ్లాట్ ఫాంపై ఉన్న సీట్లలో కూర్చుని రైలు కోసం వెయిట్ చేస్తున్నారు.. వీరి పక్కనే జహంగీర్ అనే ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కూర్చొన్నాడు. ఉక్కపోతగా ఉండటంతో ఓ మహిళ తన చీర కొంగుతో విసురుకుంటోంది.. దీనిని గమనించిన జహంగీర్ చుట్టూ ప్రయాణికులు ఉన్నారని కూడా మరచిపోయి.. ఆ మహిళ ఒంటిపై చేయి వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు.

కానిస్టేబుల్ ప్రవర్తనను ఆ మహిళ పక్కనే కూర్చొన్న మరో మహిళ గమనించింది. అంతే తోటి ప్రయాణికులకు చెప్పి దేహాశుద్ధి చేయించింది. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అవ్వడం.. విషయం ఉన్నతాధికారులకు తెలియడం.. అతని ఉద్యోగం పోవడం వెంట వెంటనే జరిగిపోయింది.