గణేశుడిపై కేరళ స్పీకర్ ఏఎన్ శంశీర్ అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలకు హిందు సంఘాల డిమాండ్
గణేశుడిపై కేరళ స్పీకర్ ఏఎన్ శంశీర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రైట్ వింగ్ సంఘాలు మండిపడుతున్నాయి. గణేశుడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారని కొందరు హిందుత్వవాదులు చేస్తున్న వాదనలు అవాస్తవాలని ఆయన పేర్కొన్నారు. దీనిపై బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు వీహెచ్‌పీ నిర్ణయించింది.

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ శంశీర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయనకు సమస్యలను తెచ్చిపెట్టాయి. గణేశుడు కేవలం ఒక మిథ్య, వాస్తవం కాదని ఆయన ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై హిందు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు చేసిన సీపీఎం నేత ఏఎన్ శంశీర్ పై బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అదే విధంగా విశ్వ హిందూ పరిషత్ కూడా రాష్ట్రవ్యాప్తంగా శంశీర్ పై పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వాలని నిర్ణయం చేశాయి. అలాగే, రాష్ట్రపతి, గవర్నర్‌లకూ ఓ పిటిషన్ సమర్పించాలని నిర్ణయం తీసుకున్నాయి. స్పీకర్ పదవి నుంచి ఆయనను తొలగించాలనే డిమాండ్ ఆ పిటిషన్‌లో పేర్కొనాలని నిర్ణయించాయి.
రాష్ట్ర వీహెచ్‌పీ జనరల్ సెక్రెటరీ వీఆర్ రాజశేఖరన్ మాట్లాడుతూ.. స్పీకర్ ఎవరూ అంగీకరించిన విధంగా తప్పుడు వ్యాఖ్యలు చేశారని వివరించారు. హిందూ ఐక్యవేది కూడా ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
తిరువనంతపురం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ రాజీవ్ మాట్లాడుతూ.. హేతబద్ద ఆలోచనలను ప్రోత్సహిస్తూ హిందూ విశ్వాసాలను గాయపరిచారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. తిరువనంతపురం సిటీ పోలీసు కమిషనర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు.
Also Read: Kerala: మరణించిన కొన్నేళ్లకు ఆ దంపతుల మ్యారేజీ రిజిస్ట్రేషన్.. ఎందుకంటే?
స్పీకర్ ఏఎన్ శంశీర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ కేరళ టెంపులో ప్రొటెక్షన కమిటీ సచివాలయానికి మార్చ్ చేయాలని పిలుపు ఇచ్చింది. ఈ మార్చ్ రేపు (26వ తేదీన) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.
ఎర్నాకుళంలోని కున్నతునాడులో ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్‌లో జులై 21వ తేదీన విద్యాజ్యోతి కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక విజ్ఞానాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన పరిణామాలను బోధించకుండా హిందు మిథ్స్‌ను ప్రమోట్ చేసే పని పెట్టుకుందని ఆరోపించారు. ప్లాస్టిక్ సర్జరీ, సంతానలేమికి థెరపీ, విమానాలు హిందూ మతం ప్రారంభంలోనే ఉన్నాయని వారు వాదిస్తున్నారని పేర్కొన్నారు. తాను స్కూల్‌లో చదువుకునేటప్పుడు విమాన సృష్టికర్తలుగా రైట్ సోదరులు ఉన్నారని వివరించారు. ఇప్పుడు తొలి విమానం పుష్పక విమానం అని చెప్పే వాదనలు చేస్తున్నారని తెలిపారు. అంతేకాదు, కొందరు హిందుత్వ వాదులు గణేశుడు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఏనుగు తలను అతికించుకున్నారనీ వాదిస్తున్నారని, అది వట్టి మిథ్య అని పేర్కొన్నారు.