Kerala: మరణించిన కొన్నేళ్లకు ఆ దంపతుల మ్యారేజీ రిజిస్ట్రేషన్.. ఎందుకంటే?
కేరళలో ఆ దంపతులు మరణించిన కొన్నేళ్లకు వారి మ్యారేజీ రిజిస్ట్రేషన్ చేయించారు. తద్వార వారి కొడుకు తండ్రి ఆస్తులకు వారసుడు అయ్యాడు. తండ్రి ఆస్తులకు వారసత్వం కోసం ఈ మ్యారేజీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయింది.
తిరువనంతపురం: కేరళలో అరుదైన విషయం వెలుగులోకి వచ్చింది. మరణించిన దంపతుల మ్యారేజీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేశారు. అందుకు ప్రభుత్వం కూడా సమ్మతించింది. తండ్రి ఆస్తులకు చట్టబద్ధమైన వారసత్వం కోసం ఈ దరఖాస్తు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తిరువనంతపురంలోని కలియకావిలాకు చెందిన ఎస్ అజికుమార్, తిరువనంతపురం సబర్బ్ ముల్లూరుకు చెందిన జాపీ పీ దాస్ దంపతులు మరణించిన కొన్నేళ్లకు వారి వివాహాన్ని నమోదు చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. జాలీ తండ్రి జ్ఞానదాస్ విజ్ఞప్తి మేరకు ఈ ఆదేశాలు సాకారం అయ్యాయి.
అజికుమార్, జాలీలు 2008 ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లిని రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే వారు చెన్నైకి వెళ్లిపోయారు. అజికుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. జాలీ ఒక రీసెర్చ్ స్టూడెంట్. వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బాబు పుట్టాడు.
బాబు పుట్టిన తర్వాత 2012లో వారు ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో జాలీ మరణించింది. ఆ తర్వాత 2018లో అనారోగ్యంతో అజికుమార్ మరణించాడు. దీంతో కొడుకు అనాథ అయ్యాడు. ఆ పిల్లాడిని జాలీ దాస్ తండ్రి జ్ఞానదాస్ తీసుకెళ్లాడు. జ్ఞానదాస్ సంరక్షణలోనే ఆ పిల్లాడు ఉన్నాడు. కానీ, జ్ఞానదాస్ కూతురు జాలీ దాస్.. అజి కుమార్‌ను పెళ్లి చేసుకున్నట్టు అధికార పత్రాలేమీ లేవు. దీంతో అజి కుమార్ ఆస్తి ఆయన కుమారుడికి దక్కే మార్గం లేకపోయింది.
Also Read: Parliament: పార్లమెంటులో ప్రతిపక్షనేత ఖర్గే మైక్ ఆఫ్ చేశారు.. ‘ఇండియా’ పార్టీల వాకౌట్
అందుకే జ్ఞానదాస్ తన కూతురు జాలీ దాస్, అల్లుడు అజి కుమార్‌లు మరణించినప్పటికీ వారి పెళ్లిని చట్టబద్ధంగా నమోదు చేయాలని అనుకున్నాడు. తద్వార తన మనవడు వారి ఆస్తికి వారసుడిగా మారుతాడు. జ్ఞానదాస్ ప్రయత్నాలకు ప్రభుత్వం సుముఖంగా స్పందించింది.
ఇలా దంపతులు మరణించిన తర్వాత పెళ్లిని నమోదు చేసుకోవడం ఇదే తొలిసారేమీ కాదు. గతేడాది కూడా భాస్కరన్ నాయర్, కమలంల పెళ్లి 53 ఏళ్ల తర్వాత రిజిస్టర్ చేశారు. వారి మ్యారేజీ సర్టిఫికేట్ లేనందున ఫ్యామిలీ పెన్షన్ ప్రయోజనాలు దక్కడం లేదని వారి కుమారుడు గోపకుమార్ ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. ప్రత్యేక ఆదేశాలతో ఆయన తల్లి, తండ్రి పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించాడు.