ఓ వ్యక్తి మర్డర్ కేసులో నుంచి బయటపడటానికి ఏకంగా తన గుర్తింపునే మార్చుకున్నాడు. మరో ఇద్దరిని చంపేసి, ఆ ఇద్దరిలో తానూ ఒకడిగా నమ్మించాడు. 20 ఏళ్లుగా ప్రశాంతంగా జీవితం గడిపాడు. కుటుంబంతోనే ఉన్నాడు. ఇప్పుడు 60 ఏళ్ల వయసులో అంటే 20 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. 

ఆ వ్యక్తి పోలీసుల రికార్డుల్లో 20 ఏళ్ల క్రితమే మరణించాడు. మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు మరణించాడని రాజస్తాన్ పోలీసులు కేసును మూసేశారు. అంతా ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ, ఆ వ్యక్తి వేసిన స్కెచ‌తో దిమ్మదిరిగిపోయింది. చదివింది ఎనిమిదో తరగతి కానీ, ఆయన అతితెలివి ఊహించలేనిది. మర్డర్ల కేసులో నుంచి తప్పించుకోవడమే కాదు, కుటుంబంతో ప్రశాంతంగా మళ్లీ జీవితాన్ని ప్రారంభించాడు కూడా. ఈ కేసు వివరాలేమిటో చూద్దాం.

హర్యానా పానిపట్‌కు చెందిన బాలేశ్ కుమార్ ఎనిమిదో తరగతి చదువుకున్నాడు. 1981లో ఇండియన్ నేవీలో స్టీవార్డ్‌గా చేరాడు. 1996 వరకు సేవలు అందించాడు. రిటైర్‌మెంట్ తర్వాత ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.

ఇప్పుడు 60 ఏళ్లున్న బాలేశ్ కుమార్ తనకు 40 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బావమరిది రాజేశ్ అలియాస్ ఖుషీరామ్‌ను 2004లో డబ్బు సంబంధ వివాదంలో ఢిల్లీలోని బావనలో చంపేశాడు. రాజేశ్ భార్యతో బాలేశ్‌కు అక్రమ సంబంధం కూడా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు ట్రాన్స్‌పోర్టులో వ్యాపారంలో ఉన్న బాలేశ్ కుమార్ ఆ వెంటనే ట్రక్కులో రాజస్తాన్‌కు పారిపోయాడు. అక్కడే ట్రక్కుకు నిప్పు పెట్టాడు. వెంటవచ్చిన ఇద్దరు లేబర్లను తగులబెట్టి చంపేశాడు.

పోలీసులు స్పాట్‌కు వచ్చారు. మరణించిన ఇద్దరు లేబర్లలో ఒకరిని బాలేశ్ కుమార్‌గా పొరబడ్డారు. ఆయన కుటుంబం కూడా బాలేశ్‌గానే పేర్కొంది. దీంతో మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు మరణించాడని కేసును మూసేశారు.

Also Read: Madhya Pradesh Assembly Elections 2023 : కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఐపీఎల్ టీమ్, మధ్యప్రదేశ్‌లో సంచలన హామీలు

కానీ, బాలేశ్ మాత్రం అక్కడి నుంచి పంజాబ్‌కు పారిపోయాడు. అక్కడ కుటుంబ సభ్యుల సహకారంతో ఒక నకిలీ గుర్తింపు సంపాదించుకున్నాడు. అమన్ సింగ్‌గా అవతారమెత్తాడు. ఆయన కుటుంబం, భార్యతో టచ్‌లోనే ఉన్నాడు. నేవీ నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్, పెంచన్‌ భార్య పొందేలా చూశాడు. తన సోదరుడు మహిందర్ సింగ్ పేరు మీద రిజిస్టర్ అయిన ట్రక్కుకు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని భార్యకు అందేలా చేశాడని పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత బాలేశ్ ఢిల్లీలోని నజఫ్‌గడ్‌కు వెళ్లి కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. ప్రాపర్టీ డీలర్‌గా పని చేస్తున్నాడు. అయితే, బాలేశ్ గురించి ఢిల్లీ పోలీసులకు సమాచారం అందడంతో అరెస్టు చేసి రాజస్తాన్ పోలీసులు ఉప్పందించారు. ట్రక్కు దగ్దం కేసు తెరువాలని సూచించారు. ఈ కేసులో నేరాలను బాలేశ్ అంగీకరించాడు.

రాజేశ్ హత్య కేసులో బాలేశ్ సోదరుడి ప్రమేయం కూడా ఉండి ఉంటుందని 20 ఏళ్ల క్రితం కేసులో పోలీసులు పేర్కొన్నారు.