కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఐపీఎల్ టీమ్, మధ్యప్రదేశ్‌లో సంచలన హామీలు
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించింది. ఇందులో సంచలన హామీలను పేర్కొంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఒక ఐపీఎల్ టీమ్ ఉంటుందని హామీ ఇచ్చింది.
భోపాల్: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో పార్టీలు తమ ప్రచార క్యాంపెయిన్‌లపై ప్రధానంగా దృష్టి సారించాయి. అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలు, పథకాలను ఏకరువు పెడుతున్నాయి. మధ్యప్రదేశ్ ఇందుకు మినహాయింపేమీ కాదు. అక్కడ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మ్యానిఫెస్టో మాత్రం సంచలనంగా ఉన్నది. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఐపీఎల్ టీమ్‌ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోలో ప్రకటించడం చర్చనీయాంశమైంది.
59 హామీలతో 106 పేజీల మ్యానిఫెస్టోను ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసింది. ఇందులో రాష్ట్రంలోని పౌరులు అందరికీ రూ. 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తామని ప్రకటించింది. బీసీలకు 27 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని తెలిపింది. రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు సహా సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి పార్టీ హామీ ఇచ్చింది.
తాము రూ. 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని, ఇందులో యాక్సిడెంట్ కవర్ రూ. 10 లక్షలు అని కమల్ నాథ్ ఈ మ్యానిఫెస్టో విడుదలు చేస్తూ వెల్లడించారు. అంతేకాదు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్‌కు ఒక ఐపీఎల్ టీమ్ ఉంటుందని వివరించారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని, మహిళలకు నెలకు రూ. 1,500 ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.
Also Read: స్వలింగ సంపర్క జంటలకు దత్తత హక్కులు లేవు: 3:2 తీర్పులో సుప్రీం కోర్టు
ఎల్పీజీ సిలిండర్‌ను రూ. 500లకు అందిస్తామని, పాఠశాల విద్యను ఉచితంగా అందిస్తామని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని, రూ. 1,500 నుంచి రూ. 2000 వరకు నిరుద్యోగ యువతకు భృతి రెండేళ్లపాటు అందిస్తామని చెప్పారు.