దేశవ్యాప్తంగా నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో పలు చోట్ల హింసాకాండ చోటు చేసుకుంది. గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

శ్రీరామనవమి వేడుకల సందర్భంగా బుధ, గురువారాల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్గాల మధ్య మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో, గుజరాత్ లోని వడోదరలో, పశ్చిమబెంగాల్ లోని హౌరాలో ఈ ఘటనలు జరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. లాఠీలకు పని చెబుతూ, అల్లరి మూకలను అదుపులోకి తీసుకున్నారు. 

ఔరంగాబాద్ లో..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలోని రామాలయం వద్ద రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. దీనిని అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో 500 మంది ఉన్న గుంపు పోలీసులపై రాళ్లు, పెట్రోల్ నింపిన బాటిళ్లను విసిరారు. దీంతో 12 మంది గాయపడ్డారు. ఇందులో 10 మంది పోలీసులు ఉన్నారు. నగరంలోని ప్రసిద్ధ రామాలయం ఉన్న నగరంలోని కిరాద్ పురా ప్రాంతంలో బుధ, గురువారాల్లో అర్ధరాత్రి దుండగులు 13 వాహనాలను తగలబెట్టారు.

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగరు మృతి, ఇద్దరికి గాయాలు

అల్లరి మూకలను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి కొన్ని ప్లాస్టిక్ బుల్లెట్లు, లైవ్ రౌండ్లు ప్రయోగించారని, నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఛత్రపతి శంభాజీనగర్ గా పేరుగాంచిన ఔరంగాబాద్ అంతటా భద్రతా సిబ్బందిని మోహరించారు.

వడోదరలో..
వడోదరలో గురువారం శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా హిందువులు, ముస్లింల మధ్య హింస చెలరేగింది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగిన ఊరేగింపు పోలీసు భద్రతతో ఫతేపురా రోడ్డు గుండా వెళ్తుండగా పంజ్రిగర్ మహోల్లా ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. ఘర్షణ అనంతరం పోలీసులు వచ్చి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయని, ఎవరికీ గాయాలు కాలేదని, పోలీసు రక్షణలో ఊరేగింపు అనుకున్న మార్గంలో కొనసాగిందని పోలీసులు తెలిపారు. 

ఇండోర్ ఆలయ ప్రమాదంలో 36కు చేరుకున్న మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ఈ ఘర్షణలో దుండగులు ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. రాళ్లు రువ్విన వారి కోసం సంఘటనా స్థలంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మసీదు ముందు ఊరేగింపు జరిగినప్పుడు కొందరు గుమిగూడారని వడోదర డిప్యూటీ పోలీస్ కమిషనర్ యశ్పాల్ జగనియా తెలిపారు. కానీ వారిని అక్కడి నుంచి వెళ్లిపోయేలా ఒప్పించారు. ఊరేగింపు ముగియడంతో ప్రస్తుతం ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉందన్నారు. దీనిపై వడోదర భజరంగ్ దళ్ అధ్యక్షుడు కేతన్ త్రివేది స్థానిక మీడియాతో మాట్లాడుతూ రాళ్లదాడి కుట్రలో భాగంగానే జరిగిందని ఆరోపించారు. 

హౌరా లో.. 
పశ్చిమబెంగాల్ లోని హౌరా నగరంలో గురువారం సాయంత్రం శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది. ఈ ఘర్షణలో దుండగులు పలు వాహనాలను తగలబెట్టడంతో పాటు దుకాణాలను ధ్వంసం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ధర్నా చేస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఊరేగింపు కాజీపారా ప్రాంతం గుండా వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

నేను లొంగిపోవడం లేదు : అమృతపాల్ సింగ్ వీడియో యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం..

హింసాకాండలో పలు దుకాణాలు, ఆటోలు ధ్వంసం కాగా, కొన్ని పోలీసు వాహనాలతో సహా పలు కార్లు దగ్ధమయ్యాయి. మంటలను ఆర్పేందుకు నాలుగు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగం చేశారు. పరిస్థితి అదుపులో ఉందని చెబుతున్న ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.