ఒడిశా రాష్ట్రంలోని సంభల్ పూర్ లో గురువారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని సంభల్ పూర్ లో శుక్రవారం నాడు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.మృతులను ఒడిశా రాష్ట్రంలోని జార్సుగూడ జిల్లాలోని లక్దాపూర్ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో మృతి చెందినవారిని సంభల్ పూర్ ఆసుపత్రిలో చేర్పించారు. మృతదేహలను సంభల్ పూర్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఇదే ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు.
లక్దాపూర్ గ్రామం నుండి పరంపూర్ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన 11 మంది ఒకే వాహనంలో పెళ్లికి హాజరై తిరుగు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత వాహనం డ్రైవర్ కన్పించకుండా పోయాడు. దీంతో డ్రైవర్ పారిపోయి ఉంటారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
