సారాంశం

మణిపూర్ హింస గురించి ప్రభుత్వం పార్లమెంటులో చర్చించాలని, దానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇందుకోసం ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ ఏకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనే ఆలోచనలూ చేశాయి. ఈ సందర్భంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ హింసపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఎంతసేపైనా చర్చకు రెడీ అంటూ కామెంట్ చేశారు. ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలు అధిర్ రంజన్ చౌదరి, మల్లికార్జున్ ఖర్గేలకు లేఖ రాశారు.
 

న్యూఢిల్లీ: జాతుల హింసాత్మక ఘర్షణలతో రక్తమోడుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ గురించి పార్లమెంటులో చర్చించడానికి తమ ప్రభుత్వం భయపడటం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కోరినంత కాలం మణిపూర్ పై చర్చించడానికి తాము సిద్ధం అంటూ లోక్‌సభ, రాజ్యసభలోని ప్రతిపక్ష నేతలకు ఆయన లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు.

ప్రతిపక్షాలకు కోఆపరేషన్‌పై, దళితులు, మహిళల సంక్షేమంపై ఆసక్తి లేదని హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో అన్నారు. అందుకే వారు స్లోగన్‌లు ఇస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని వివరించారు. అయినా.. తాను ఒక విషయం చెప్పదలుచుకున్నట్టు పేర్కొన్నారు. మణిపూర్ గురించి వివరంగా ఉభయ సభల్లోనూ చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. ప్రభుత్వానికి ఏ భయమూ లేదని, చర్చించడానికి ఎవరు సిద్ధమైనా వారికి స్వాగతం అంటూ అన్నారు.

‘మా దగ్గర దాచుకోవడానికి ఏమీ లేదు. మేం ఎన్నికలకు వెళ్లాల్సి ఉన్నది. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. మణిపూర్ వంటి సున్నితమైన అంశాలపై చర్చించేందుకు సానుకూల వాతావరణం అవసరం’ అని అన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేలకు తాను ఇందుకు సంబంధించి లేఖ కూడా రాసినట్టు పేర్కొన్నారు.

Also Read: Parliament: పార్లమెంటులో ప్రతిపక్షనేత ఖర్గే మైక్ ఆఫ్ చేశారు.. ‘ఇండియా’ పార్టీల వాకౌట్

‘మణిపూర్ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అన్ని పార్టీలు తమ తమ పార్టీల వైఖరులను దాటి చర్చించడానికి ఆలోచించాలి. ముఖ్యమై అంశాల్లో పరిష్కారాలకు అన్ని పార్టీలు సహకరిస్తాయని భావిస్తున్నాను.’ అని ఆయన రాశారు.

మణిపూర్ అంశం గురించి పరోక్షంగా ప్రధాని మోడీ పార్లమెంటు వెలుపల ఓ ప్రకటన చేశారు. అయితే, పార్లమెంటు లోపల ప్రధాని మోడీ మాట్లాడాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. మణిపూర్ పై చర్చించడానికి ముందు ప్రధాని మోడీ స్టేట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాల ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.

మణిపూర్ చర్చకు సంబంధించి అమిత్ షా ఈ వ్యాఖ్యలు కీలక సమయంలో చేశారు. మణిపూర్ హింస పై ప్రధాని నరేంద్ర మోడీ చర్చించడానికి లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని ప్రతిపక్షాల ఇండియా కూటమి ఆలోచనలు చేస్తున్న సందర్భంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాము చర్చకు సిద్ధమంటూ ఈ ప్రకటన చేశారు.