రాజస్థాన్ రైఫిల్ కోచ్ శశికాంత్ శర్మపై అత్యాచారం కేసు..
రాజస్థాన్ రైఫిల్ కోచ్ క్రీడాకారిణుల మీద అత్యాచారానికి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు ఆరోపణలు వెల్లువెత్తడంతో అతని మీద కేసు నమోదయ్యింది.

రాజస్థాన్ : మహిళలు ఏ రంగంలో అడుగుపెట్టినా లైంగిక వేధింపులు వారిని వెంటాడుతూనే ఉంటాయి. అనుకున్న లక్ష్యాలను చేరకుండా కిందికి లాగుతూనే ఉంటాయి. మహిళల ఆశలను, ఆశయాలను తమ స్వార్థానికి అనువుగా వాడుకుంటూ వారిమీద వేధింపులకు పాల్పడే కీచకులు ప్రతీచోటా కనిపిస్తూనే ఉంటారు. ప్రతిచోట ఈ వేధింపుల అంశం మహిళలని కలవర పెడుతూనే ఉంది. తాజాగా రాజస్థాన్ రైఫిల్ సంఘంలో లైంగిక వేధింపుల అంశం కలకలం రేపింది.
రైఫిల్ కోచ్ శశికాంత్ శర్మపై పోలీసులు అత్యాచారం కేసును నమోదు చేశారు. శశికాంత్ శర్మ మీద అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు వచ్చాయి. గత కొన్నేళ్లుగా శశికాంత్ శర్మ కొంతమంది అమ్మాయిలపై ఈ వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులు అందాయి.
రాజస్థాన్ రైఫిల్ సంఘం సంయుక్త కార్యదర్శి పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకే పోలీసులు కోచ్ శశికాంత్ శర్మపై కేసు నమోదు చేసినట్లుగా తెలిసింది. ఇద్దరు అమ్మాయిలతో కోచ్ శశికాంత్ శర్మ ఇటలీలో ఓ టోర్నీకి వెళ్ళినప్పుడు అత్యాచారానికి పాల్పడ్డాడని.. మరో ముగ్గురు అమ్మాయిలను లైంగికంగా వేధించాడని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు.
శశికాంత్ శర్మ అకృత్యాలు ఏళ్ల తరబడి సాగుతున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. కోచ్ లైంగిక వేధింపులకు పాల్పడిన క్రీడాకారులలో ఒక మైనర్ బాలిక ఉండడంతో అతని మీద ఫోక్సో కేసు కూడా నమోదు చేశారు. శశికాంత్ శర్మ బాధితుల్లో మరికొంతమంది కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు శశికాంత్ శర్మను అరెస్టు చేయలేదని.. పోలీసులు స్పష్టం చేశారు.