అత్తమీద కోడలు దాష్టీకం.. ఇంట్లోనుంచి వెళ్లిపోవాలంటూ.. కొట్టి, సోఫాలోనుంచి కిందికి లాగి, ఈడ్చుకెడుతూ..
అత్తను ఇంట్లోనుంచి గెంటేస్తున్న కోడలుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ కోడలు తన అత్తగారిని కొట్టి, సోఫాలో నుంచి నేలపైకి లాగి, ఆమెను ఇంట్లో నుంచి బైటికి గెంటడానికి ప్రయత్నించింది.

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని థానే జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ కోడలు అత్తగారిపై అమానవీయంగా దాడికి పాల్పడింది. ఈ ఘటన వెలుగు చూడడంతో ఆ మహిళపై కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో మహిళ తన అత్తగారిని ఇంటి నుండి బయటకు పంపించడానికి ప్రయత్నించింది.
దీనికోసం సోఫాలో కూర్చున్న అత్తగారిని నేలమీదికి లాగింది. ఇంటి పనిమనిషిలా అనిపిస్తున్న మరో మహిళ కూడా వీడియోలో కనిపిస్తుంది. కానీ, అత్తమీద కోడలు చేస్తున్న దాష్టీకాన్ని అడ్డుకోవడానికి ఆమె ఎలాంటి ప్రయత్నం చేయకుండా చూస్తూ ఉండిపోయింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 336, 337, 323, 504, 506 సెక్షన్ల కింద మహిళపై అభియోగాలు మోపారు. ఈ ఘటనపై నిందితురాలి అత్త కోప్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
చండీగఢ్ ఆస్పత్రిలో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం..
అయితే ఈ కేసుపై పోలీసులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.సోఫాలో కూర్చున్న తన వృద్ధ అత్తగారిని ఇంటి నుండి బయటకు వెళ్లమని నిందితురాలైన మహిళ అడగడంతో వైరల్ వీడియో ప్రారంభమవుతుంది. అత్తగారు దీనికి నిరాకరించి, కోడలినే ఇంట్లో నుంచి వెళ్లమన్నంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుండగానే కోడలు ఆమెను కొట్టడం ప్రారంభించింది.
ఆ తరువాత వయసులో పెద్దది అని కూడా చూడకుండా ఆమెను కొట్టి, బలవంతంగా సోఫాలో నుండి కిందికి లాగి.. బైటికి నెట్టడం ప్రారంభించింది. అత్తాకోడళ్ళిద్దరూ వాగ్వాదానికి దిగడం వీడియోలో వినిపిస్తుంది. కోడలు ఆమెను లేచి వెళ్ళమని నిలకడగా అడుగుతుంది. కొద్దిసేపటి తర్వాత, ఆ మహిళ మెయిన్ డోర్ దగ్గరకు వెళ్లి తలుపులు తెరుస్తుంది. తరువాత, ఆమె తన అత్తగారి వద్దకు తిరిగి వెళ్లి ఆమెను నేలపైకి లాగుతుంది. వృద్ధ మహిళ నేలపై పడుకుని, బట్టలు చెదిరిపోగా సర్దుకోవడానికి ప్రయత్నిస్తోంది.
నిందితురాలైన మహిళకు ఆ సమయంలో ఫోన్ కాల్ వస్తే.. అత్త మీద దాడి కాసేపు ఆపి.. కాల్ మాట్లాడుతుంది. ఆ తువాత తన అత్తగారిని ఇంట్లో నుంచి బయటకు లాగేయడం కొనసాగిస్తుంది. అత్తగారు కోడలితో తీవ్రంగా పోరాడుతుంది. దీనివల్ల కోడలి పట్టునుంచి అత్త కాస్త తప్పించుకోగలుగుతుంది.
చివరగా వీడియోలో కోడలు ఓ స్టూల్ లాంటి దానిమీద కూర్చుని ఉండగా.. మహిళ పాదాల దగ్గర ఆమె అత్తగారు నేలపై కూర్చుని తమ వాదనను కొనసాగించడంతో వీడియో ముగుస్తుంది. ఈ ఘటనకు గల కారణాలు, ఇంట్లో సీసీటీవీ కెమెరా ఎందుకు, ఎవరు అమర్చారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.