చెన్నై: ప్రముఖ సామాజిక కార్యకర్త, రాజకీయ నేత రామసామి పెరియార్ పై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పెరియార్ పై చేసిన వ్యాఖ్యలకు రజినీకాంత్ క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ పెద్ద యెత్తున వస్తోంది. అయితే, తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదని రజినీకాంత్ తేల్చి చెప్పారు. తుగ్లక్ వారపత్రిక కార్యక్రమంలో రజినీకాంత్ రామసామి పెరియార్ పై వ్యాఖ్యలు చేశారు. దీంతో రామసామి పెరియార్ ఎవరనే ఆసక్తి నెలకొంది. 

ఎరోడ్ వెంకటప్ప రామసామి పెరియార్ గా ప్రసిద్ధి పొందారు. పెరియార్ అంటే పెద్ద అని అర్థం. రామసామి పెరియార్ 1870 సెప్టెంబర్ 17వ తేదీన ఎరోడ్ లో జన్మించారు. అప్పుడు అది మద్రాస్ ప్రెసిడెన్సీలోని కోయంబత్తూర్ జిల్లాలో ఉంది. 94 ఏళ్ల వయస్సులో ఆయన 1973 డిసెంబర్ 24వ తేదీన కన్ను మూశారు.

Also Read: పెరియార్ రామస్వామిపై వ్యాఖ్యలు: రజినీకాంత్ పై భగ్గుమంటున్న ద్రవిడ పార్టీలు

రామసామిని ద్రావిడ ఉద్యమానికి పితామహుడిగా భావిస్తారు. తమిళనాడు బ్రాహ్మణ ఆధిపత్యానికి, కుల మనుగడకు, మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆత్మగౌరవ పోరాటంగా దాన్ని ముందుకు తెచ్చారు. ద్రవిడార్ కఝగమ్ వ్యవస్థాపకుడు కూడా. జాతీయ సూత్రాలను, ఆత్మగౌరవాన్ని, మహిళా హక్కులను, కుల నిర్మూలనను ఆయన ఆశించారు. 

తాను జీవించి ఉన్న కాలంలో కూడా రామసామి వివాదాస్పదుడిగానే ఉన్నారు. 1919లో ఆయన కాంగ్రెసు పార్టీలో చేరారు. బ్రాహ్మణాధిక్యత ఉందనే కారణంతో కాంగ్రెసు నుంచి బయటకు రావాలని 1925లో నిర్ణయించుకున్నారు. జస్టిస్ పార్టీ పేరు మీద సొంత పార్టీని ఏర్పాటు చేశారు. దానికి ద్రావిడార్ కఝగమ్ గా పేరు మార్చారు.

రామసామి బోధించిన బ్రాహ్మణాధిక్యత, యాంటీ హిందూ సూత్రాలను ప్రాతిపదికగా చేసుకునే అన్ని ద్రావిడ పార్టీలు ఆవిర్భవించాయి. అవి అన్నాడియంకె, డిఎంకె. డీకే, పిఎంకె, ఎండిఎంకే. కుల నిర్మూలన కోసం పెరియార్ పలు ఆందోళనలు చేపట్టారు. తమిళ భాష గౌరవించాలని, హిందూ భాషను రుద్దే ప్రయత్నాలు వ్యతిరేకించాలని ఆయన బోధించారు. 

Also Read: వెనక్కి తగ్గేది లేదు: పెరియార్ రామస్వామిపై వ్యాఖ్యల మీద రజినీకాంత్

అందరూ సమానంగానే జన్మించారని ఆయన ప్రచారం చేస్తూ వచ్చారు. కుల, జాతి ప్రాతిపదికపై వివక్షలు కూడదని ఆయన చెప్పారు. ఆయన ప్రసంగాలన్నీ నిరక్షరాస్యులను లక్ష్యంగా ఎంచుకున్నాయి. అయితే, విద్యావంతులు కూడా ఆయన సిద్ధాంతాన్ని సొంతం చేసుకున్నారు.