చెన్నై: పెరియార్ ఈవీ రామస్వామిపై చేసిన వ్యాఖ్యల మీద వెనక్కి తగ్గడానికి తమిళ సూపర్ స్టార్, రాజకీయ నేత రజినీకాంత్ నిరాకరించారు. పెరియార్ రామస్వామిపై రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని పెరియార్ రామస్వామి అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. 

క్షమాపణలు చెప్పకపోతే రజినీకాంత్ ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. పోయెస్ గార్డెన్ లోని ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు దాదాపు 10 మంది క్రియాశీలక కార్యకర్తలు సిద్ధమవుతున్న తరుణంలో రజినీకాంత్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని రజినీకాంత్ చెప్పారు .తుగ్లక్ మ్యాగజైన్ స్వర్ణోత్సవాల సందర్భంగా జరిగిన సమావేశంలో రజినీకాంత్ పెరియార్ రామస్వామికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను చదివింది, విన్నది మాత్రమే చెప్పానని ఆయన అన్నారు. అందుకు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వ్యాసాన్ని కూడా ఉటంకించారు. 

రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలకు బిజెపి కార్యకర్తల నుంచి మద్దతు లభించింది. పెరియార్ అనుచరులపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన రజినీకాంత్ పై చర్యలు తీసుకోవాలని ట్రిప్లికేన్ పోలీసులను ఆదేశించాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

రజినీ ఆసలేమన్నారు....

1971లో పెరియార్ రామస్వామి నిర్వహించిన ర్యాలీలో సీతారాములు విగ్రహాలను అభ్యంతరకరంగా ఊరేగించారని రజినీకాంత్ తుగ్లక్ పత్రిక కార్యక్రమంలో అన్నారు. ఏ ఒక్క వార్తాపత్రిక కూడా దాన్ని ప్రచురించలేదని, కానీ తుగ్లక్ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు చో రామస్వామి ఒక్కరే వార్తను రాసి, ఖండిచారని ఆయన చెప్పారు. 

ఆ వార్త కరుణానిధి నేతృత్వంలోని అప్పటి డిఎంకె ప్రభుత్వాన్ని కుదిపేసిందని, ఆ మేగజైన్ కాపీలను అధికారులు సీజ్ చేస్తే చో రామస్వామి వాటిని తిరిగి ముద్రించారని ఆయన చెప్పారు.