చెన్నై: పెరియార్ రామస్వామిపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలపై ద్రవిడ పార్టీలు భగ్గుమన్నాయి. ఆయన వ్యాఖ్యలపై తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ స్పందించాయి. డిఎంకె, ఎఐఏడియంకెలతో పాటు కాంగ్రెసు, బిజెపిలు కూడా రజినీకాంత్ వ్యాఖ్యలపై మాట్లాడాయి. 

కొన్ని పార్టీలు ఆయనపై తీవ్రంగా ధ్వజమెత్తాయి. మరికొన్ని పార్టీలు ఆయనకు సలహాలు ఇచ్చాయి. ఆలోచించి మాట్లాడాలని డీఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ అన్నారు. రజినీకాంత్ రాజకీయ నాయకుడు కారని, ఆయన నటుడు అని, పెరియార్ పై ఆలోచించి మాట్లాడాలని ఆయన అన్నారు. పెరియార్ 95 ఏళ్ల పాటు జీవించి తమిళ జాతి కోసం పనిచేశారని ఆయన అన్నారు.

తాను రాజకీయాల్లోకి వచ్చి ఇంత దూరం రావడానికి పెరియార్ కారణమని అన్నాడియంకె సమన్వయకర్త, తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ పన్నీరు సెల్వం అన్నారు. పెరియార్ లేకపోతే తాను ఇక్కడ ఉండేవాడని కానని ఆయన అన్నారు. రజినీకాంత్ వ్యాఖ్యలను మత్స్య శాఖ మంత్రి డి జయకుమార్ కూడా ఖండించారు. 

రజనీకాంత్ చెప్పినట్లుగా ఏమీ జరగలేదని ఆయన అన్నారు. జరగని విషయం మాట్లాడి ప్రజలను తప్పుదారి పట్టించడానికి రజినీకాంత్ ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అడిగారు. విషయం 50 ఏళ్ల నాటిదని, దానిపై చౌకబారు రాజకీయాలు చేయడం తగదని ఆయన అన్నారు. మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయని, మనం గతంలో మిగిలిపోకూడదని ఆయన అన్నారు. 

Also Read: వెనక్కి తగ్గేది లేదు: పెరియార్ రామస్వామిపై వ్యాఖ్యల మీద రజినీకాంత్

రజనీ వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెసు చీఫ్ కెఎస్ అళగిరి ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన రజినీకాంత్ ఇప్పటి వరకు రాలేదని ఆయన అన్నారు. పెరియార్ గురించి అటువంటి వ్యాఖ్యలు చేయడం ఈ స్థితిలో అనవసరమైన వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన అన్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతపై తుగ్లక్ మ్యాగజైన్ పెట్టిన శీర్షికపై రజినీకాంత్ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. 

క్షమాపణ చెప్పాలనే డిమాండ్ తో రజినీకాంత్ ఇంటిని ముట్టడించడానికి జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద భద్రతను పెంచారు. 

ఇదిలావుంంటే, రజినీకాంత్ వ్యాఖ్యలను బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్ వేదికగా బలపరిచారు. కాస్తా మార్పు కోసం తాను రజినీకాంత్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. రజినీకాంత్ తన వ్యాఖ్యలపై స్థిరంగా నిలబడితే కోర్టుల్లో ఆయన తరఫున తాను నిలబడుతానని చెప్పారు.