Rajeev chandrasekhar: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు రాజీవ్ చంద్రశేఖర్ రిపోర్టర్ టీవీ చానల్‌పై రూ.100 కోట్లు పరువునష్టం కేసు వేశారు. కేరళలోని త్రివేండ్రంలో ఈ దావా దాఖలైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.? 

రిపోర్టర్ టీవీ యజమాని ఆంటో ఆగస్టిన్, సలహా సంపాదకుడు అరుణ్ కుమార్, సమన్వయ సంపాదకురాలు స్మృతి పరుతిక్కడ్, వార్తా సమన్వయకర్త జిమ్మీ జేమ్స్, త్రివేండ్రం బ్యూరో చీఫ్ టీవీ ప్రసాద్ సహా తొమ్మిది మందిపై ఈ దావా దాఖలైంది. ఈ నోటీసును ముంబైకి చెందిన RHP పార్ట్‌నర్స్ లా ఫర్మ్ పంపింది.

అసలేం జరిగిందంటే.?

రిపోర్టర్ టీవీ చానల్ రాజీవ్ చంద్రశేఖర్ పేరు BPL కంపెనీ భూమి లావాదేవీలతో అనవసరంగా కలిపి, తప్పుడు వార్తలు ప్రసారం చేసిందని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులో చానల్‌కు 7 రోజులలోపు ఆ వార్తలను తొలగించి, ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

BPL కంపెనీ వివరణ

ఇదే విషయంపై BPL కంపెనీ కూడా స్పందించింది. “రాజీవ్ చంద్రశేఖర్ గారికి మా కంపెనీతో ఎటువంటి ఆర్థిక సంబంధం లేదు. ఆయనపై ఉన్న ఆరోపణలు నిరాధారమైనవి, తప్పుడు, రాజకీయ ఉద్దేశంతో చేసినవే.” అని కంపెనీ తేల్చి చెప్పింది. ఈ ఆరోపణలను 2003లో సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. అలాగే, 1996–2004 మధ్య కంపెనీ రూ.450 కోట్లు పెట్టుబడి పెట్టిందని వివరించింది.

రాజీవ్ చంద్రశేఖర్ స్పందన

రాజీవ్ చంద్రశేఖర్ ఈ విషయమై మాట్లాడుతూ.. "అర్జెంటీనా జట్టు, మెస్సీ కేరళ పర్యటనకు సంబంధించిన అవినీతి ఘటనను దాచేందుకు నాపై ఈ తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు" అని చెప్పారు. మీడియా రంగంలో కొంతమంది అనైతిక వ్యక్తులు ప్రవేశించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అయితే వారిని ధీటుగా ఎదుర్కొంటానని చెప్పుకొచ్చారు. అలాగే.. తనపై వచ్చిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని, BPL కంపెనీ కూడా దీనిపై స్పష్టమైన ప్రకటన ఇచ్చిందని స్పష్టం చేశారు.